BigTV English

Damodaram Sanjivayya : ఆదర్శనేత.. దామోదరం సంజీవయ్య..!

Damodaram Sanjivayya : ఆదర్శనేత.. దామోదరం సంజీవయ్య..!
Damodaram Sanjivayya

Damodaram Sanjivayya Life Story : రాజకీయాలంటే రాజీపడటం, సంపదను పోగేసుకోవటం, కుర్చీ కోసం కొట్లాడటం కాదనీ, నమ్మిన విలువ కోసం జీవితాంతం నిలబడటమేనని ఆచరణలో చూపిన ఆదర్శనేతల్లో దామోదరం సంజీవయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కేవలం 39 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి.. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. దళితుడిగా జీవితంలో ఎంతో వేదనను, పీడనను అనుభవించినా.. ఏనాడూ తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోని మహానాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. నేడు ఆయన జయంతి.


కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో 1921 ఫిబ్రవరి 14న సంజీవయ్య జన్మించారు. తల్లిదండ్రులు.. సుంకులమ్మ, మునెయ్య. ఆ దంపతులకు ఆయన ఐదవ సంతానం. ఆయన పుట్టిన మూడవ రోజే.. తండ్రి మునెయ్య కన్నుమూశారు. బాల్యంలో సంజీవయ్య తన మేనమామల ఇంట చదువుకున్నారు. కర్నూలు పురపాలక పాఠశాలలో స్కూలు విద్యను పూర్తిచేసి తర్వాత అనంతపురం చేరి అక్కడ ఆర్ట్స్ కాలేజీల్లో డిగ్రీ చదివారు.

అనంతరం ఆయన కర్నూలు జిల్లా పౌరసరఫరాల శాఖలో క్లర్క్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రెండవ ప్రపంచం యుద్ధం రాకతో నాటి బ్రిటిష్ సర్కారు చేపట్టిన ధాన్య సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన బళ్లారిలో పౌరసరఫరాల శాఖలో ఇనస్పెక్టర్‌గా పనిచేశారు.


అయితే.. ఉద్యోగం చేస్తు్న్నా పై చదువులు చదవాలనే కోరిక ఆయనను వేధిస్తుండేది. బళ్లారిలో పరిచయమైన ఒక న్యాయమూర్తి సంజీవయ్య ప్రతిభను, ఆరాటాన్ని గుర్తించి మద్రాసు వెళ్లి లా చదువుకోమని ప్రోత్సహించారు. దీంతో సంజీవయ్య, ఉద్యోగం మానేసి మద్రాసు చేరి లా కోర్సులో చేరి, ఇంటింటికీ వెళ్లి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పుకుంటూ లా చదువుకున్నారు.

అనంతరం 1950లో ఆయన పిలకా గణపతి శాస్త్రి, జాస్తి సీతామహాలక్ష్మిల దగ్గర జూనియర్ అప్రెంటిస్‌గా చేరి లాయరుగా రాణించే పనిలో బిజీగా ఉన్నారు. అదే ఏడాది మన రాజ్యాంగం అమల్లోకి రావటంతో దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నియమం అమల్లోకి వచ్చింది.

అప్పటికి ఆయన సొంత జిల్లా కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఎస్. నాగప్ప అనే నేత ఉన్నారు. కొత్త నియమం ప్రకారం ఆయన ఒక పదవికి రాజీనామా చేయాల్సి రావటంతో నాగప్ప.. ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నాడు ఎంపీ పదవి ఎస్సీలకు రిజర్వు కావటంతో నాటి కాంగ్రెస్ దిగ్గజ నేత రాజగోపాలాచారి.. ఆ పదవికి సరైన వ్యక్తిని వెతికే పనిని మరో సీనియర్ నేత ఎన్జీ రంగాకు అప్పగించారు.

ఈ విషయం తెలిసిన లాయరు జాస్తి సీతామహాలక్ష్మి.. సంజీవయ్య పేరును రిఫర్ చేయగా, ఆ ప్రతిపాదనకు సంజీవయ్య అందుకు నిరాకరించినా, మిత్రుల ప్రోత్సాహంతో 29వ ఏట ఎంపీగా సంజీవయ్య పార్లమెంటులో అడుగుపెట్టారు.

తర్వాత 1952 నాటి తొలి ఎన్నికల్లో కర్నూలు నుంచి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికై రాజగోపాలాచారి ప్రభుత్వంలో హౌసింగ్, కోపరేటివ్ మంత్రిగా, తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రపు టంగుటూరి ప్రకాశం పంతులుగారి ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్, హెల్త్ మినిస్టర్‌గా, 1955 బెజవాడ గోపాల రెడ్డి ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్, కమర్షియల్ టాక్సెస్ మంత్రిగా, 1956లో విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో తన 38వ ఏట కార్మిక మంత్రిగా నియమితులయ్యారు.

సరిగ్గా ఆ సమయంలోనే ప్రధాని నెహ్రూ సీఎంగా ఉన్న సంజీవరెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేయటంతో ఆయన సీఎం పదవినుంచి తప్పుకున్నారు. దీంతో సీఎం పదవిని మరో సీనియర్ దిగ్గజ నేత, 1955లో కమ్యూనిస్టులను మట్టికరపించిన నాటి పీసీసీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రాజు ఆశించారు. అయితే.. సంజీవరెడ్డి తన తర్వాత సీఎంగా కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు సూచించారు.

దీంతో ఎట్టి పరిస్థితిలోనూ తన ప్రత్యర్థి సంజీవరెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని సీఎం కానివ్వటానికి ఇష్టపడని అల్లూరి సత్యనారాయణ రాజు.. దళిత నేత సంజీవయ్య పేరును ప్రతిపాదించగా అధిష్ఠానం సరేననటంతో 39వ ఏట సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

1960లో సీఎం కాగానే ఆయన దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. జీఓ 559ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.
సంజీవయ్య సీఎంగా ఉండగానే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్‌ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్‌ఈఎల్‌ ప్రారంభమయ్యాయి. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రకటించటం, వృద్ధాప్య పెన్షన్‌ పథకాన్ని ప్రకటించిన సీఎంగానూ ఆయన గుర్తింపు పొందారు. 1961లోనే రాష్ట్రంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ పథకాలు ప్రకటించారు.

గాంధేయవాది అయిన సంజీవయ్య హయాంలోనే ఏపీలో తొలిసారి మద్య నిషేధ విభాగాన్ని, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ మున్సిపల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఏర్పడిందీ ఈయన హయాంలోనే. అంతేకాదు.. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్‌ ఏర్పాటు చేయించారు. తెలంగాణలో ఉన్న భూములన్నింటినీ రీ సర్వే చేయించి మిగులు భూములు లెక్క తేల్చి పేదలకు పంచారు. సీఎంగా ఉండగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లేవారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు. జానపద గేయాలు, నాటకాలంటే ఆయనకు ప్రాణం.

సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత 1964 జనవరి 22న నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, తర్వాత లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి మంత్రి వర్గంలోనూ ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29వ తేదీన పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని తెచ్చి, కార్మికుల ప్రయోజనాలు కాపాడారు. దీంతో ఆయనకు ‘బోనస్‌ సంజీవయ్య’గా పేరు వచ్చింది. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్‌ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించిన గొప్ప వ్యక్తి. తన జీవితకాలంలో అతి తక్కువ సమయంలో అనేక బాధ్యతలు సమర్థంగా, నిజాయితీగా నిర్వహించిన దామోదరం సంజీవయ్య 1972 మే 7వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు.

సంజీవయ్య వ్యక్తిత్వాన్ని, నిజాయితీని గురించి ఒక సంఘటనను నాటి కాంగ్రెస్ నేతలు నేటికీ గుర్తుచేసుకుంటారు. 1959లో సంజీవయ్యపై కొందరు కాంగ్రెస్ నేతలు అవినీతి పేరుతో ప్రధాని నెహ్రూకు ఫిర్యాదుచేశారు. దీంతో నెహ్రూ ఢిల్లీ నుంచి ఒక ప్రతినిధిని సంజీవయ్య ఇంటికి పంపారు. పెద్దపాడులోని సంజీవయ్య పాత పూరింటికి వెళ్లిన ఆ ఢిల్లీ నాయకుడికి అక్కడ కట్టెల పొయ్యిమీద పొగ ఊదుతూ అన్నం వండుతోన్న సంజీవయ్య తల్లి కనిపించింది. ఆ ఇంటిలో వాతావరణం గురించి ఢిల్లీ వెళ్లాక సదరు నేత నెహ్రూకి చెప్పారు. ఆ తర్వాత నెహ్రూ ఇంకెప్పుడూ సంజీవయ్యను శంకించలేదు.

దామోదరం సంజీవయ్య జ్ఞాపకార్థం కర్నూలు జిల్లాలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్‌గా నామకరణం చేశారు. ఆయన స్వగ్రామం పెద్దపాడులో ఆయన పేరిట ఒక బాలికల వసతి గృహాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఆ గ్రామంలోని సంజీవయ్య ఇంటిని బాగుచేసి స్మారకంగా మార్చారు. ఆ ఇంటిలో నాడు ఆయన వాడిన మంచం, దుస్తులు, ట్రంకు పెట్టె ఆయన నిరాండంబర జీవితానికి గుర్తులుగా నేటికీ నిలిచి ఉన్నాయి. ఆ ఆదర్శనేత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.

Tags

Related News

EPFO Passbook Lite: ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ లైట్.. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈజీగా చెక్ చేసుకోండి!

Gold SIP Investment: నెలకు రూ.4,000 పెట్టుబడితో రూ.80 లక్షలు మీ సొంతం.. ఈ గోల్డ్ SIP గురించి తెలుసా?

New Aadhaar App: ఇకపై ఇంటి నుంచి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు, కొత్త యాప్ వచ్చేస్తోంది!

Jio Anniversary Offer: కేవలం రూ.100కే ఆల్ ఇన్ వన్ జియో ఆఫర్.. గిఫ్టులు, డిస్కౌంట్లు అన్నీ ఒకే ప్యాకేజీ!

Gold Rate Dropped: అబ్బా చల్లని కబురు.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Rental Areas in Hyderabad: హైదరాబాద్ లో అద్దె ఇల్లు కావాలా? ఏ ఏరియాల్లో రెంట్ తక్కువ అంటే?

EPFO Atm Withdrawal: ఈపీఎఫ్ఓ నుంచి మరో బిగ్ అప్డేట్.. త్వరలో ఏటీఎం తరహాలో నగదు విత్ డ్రా!

Maruti Suzuki – GST: ఓ వైపు దసరా సేల్స్, మరోవైపు జీఎస్టీ తగ్గింపు.. అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి!

Big Stories

×