Banking News: వినియోగదారులకు ఊరట కలిగిస్తూ దేశంలోని కొన్ని బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకుంటే విధించే ఛార్జీలను పలు బ్యాంకులు తొలగించాయి. వాటిలో ఎస్‌బీఐ కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కస్టమర్లకు ఇదొక తీపి కబురు.
ప్రజలకు సేవలు అందించినవాటిలో బ్యాకింగ్ సెక్టార్ చాలా కీలకమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత కస్టమర్లు చాలావరకు బ్యాంకులకు వెళ్లడం మానేశారు. కనీసం ఏటీఎం సైతం వినియోగించడం మానేశారు. డిజిటల్ ట్రాన్స్‌యాక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
దీని కారణంగా బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ తగ్గిపోతోంది. దీన్ని గమనించిన బ్యాంకులు.. మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే కస్టమర్లపై ఎడాపెడా వడ్డింపు మొదలుపెట్టాయి. బ్యాంకులు తీసుకొచ్చిన నిబంధనల కారణంగా అకౌంట్లు ఓపెన్ చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. పరిస్థితి గమనించిన కొన్ని బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఆయా బ్యాంకులు తీసుకున్న నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై కొంత భారం తగ్గనుంది. ఈ నిబంధనలు అమలు చేస్తున్నవాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి.
ALSO READ: బంగారం కొనుగోలు చేస్తే నష్టమే, ఈటీఎఫ్ లు బెస్ట్ అంటున్న నిపుణులు
జులై ఒకటి నుంచి సేవింగ్స్ ఖాతాలపై ఆయా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదు. దీనిబాటలో ఇండియన్ బ్యాంక్ వెళ్లింది. జులై ఏడు నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
కెనరా బ్యాంక్ మే నెల నుంచి సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్ఆర్ఐ, సాలరీ ఖాతాలపై ఈ ఛార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు సైతం తమ ఖాతాదారులకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
దేశంలో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల నుంచి ఈ ఛార్జీలను రద్దు చేసింది. కరోనా సమయంలో అన్ని బ్యాంకులు ఇదే పంథాను అనుసరించాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఖాతాదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే ఉద్దేశంతో ఆయా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ప్రైవేటు బ్యాంకుల నుంచి ఎలాంటి కదలిక లేదు. మాగ్జిమమ్ కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధపడ్డాయి.