Jewellery Vs Gold ETF Investment| భారతదేశంలో చాలా కుటుంబాలు సంప్రదాయ పెట్టుబడులకు బంగారన్నే ఎంచుకుంటాయి. కానీ, బంగారు నగలు ధరించడం కోసమా కొనుగోలు చేయడం ముఖ్యమా? లేక బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూడడం ఎక్కువ ఉపయోగకరమా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు వ్యాపార నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ సరైన సమాధానం చెప్పారు.
సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నితిన్ కౌశిక్ బంగారు ఆభరణాలు కొనడం పెట్టుబడి అనే ఆలోచన ఎలా సరైనదోనని ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఇలా రాశారు.. “ఆభరణాలు కొనడం vs గోల్డ్ ETFలలో పెట్టుబడి — మీరు భావోద్వేగంతో నష్టపోతున్నారా? మీ చేతిపై మెరిసే బంగారం ‘మీ సొంతం’ కాగా – అది కొన్నిసార్లు నష్టంతో కూడుకున్న ఖర్చు, పెట్టుబడి రూపంలో దాగి ఉంటుంది.” అని రాశారు.
మెరిసేది అంతా పెట్టుబడి కాదు. బంగారు ఆభరణాలు అందంగా కనిపిస్తాయి. కానీ వీటిలో దాగిన ఖర్చులు, తిరిగి విక్రయించే సమయంలో ఇబ్బందులు, భావోద్వేగ బంధం ఆర్థిక నిర్ణయాలను బలహీనం చేస్తాయి. అయితే, బంగారు ఆభరణాలు కొనడం, గోల్డ్ ETFలలో (ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్) పెట్టుబడి పెట్టడం మధ్య తేడా ఏంటి? అనేది సిఎ కౌశిక్ సరళంగా వివరించారు.
ఆభరణాలు కొనుగోలు చేస్తే నష్టమే
రూ.1 లక్షలతో ఆభరణాలు కొంటే.. మీరు తక్షణమే రూ.12,000 మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్‌పై కోల్పోతారు. ఈ డబ్బు తిరిగి రాదు. ఆభరణాలను తిరిగి విక్రయించడం లేదా డిజైన్ మార్చడం కష్టం. అమ్మినా, తక్కువ ధర లభిస్తుంది. మళ్లీ అందులో దాగిన కోతలు కూడా ఉంటాయి.
గోల్డ్ ETFలలో పెట్టుబడి ఏంటి?
అదే రూ.1 లక్షలతో గోల్డ్ ETFలలో పెట్టుబడి పెడితే.. మేకింగ్ ఛార్జీలు ఉండవు. మీరు మార్కెట్ ట్రేడింగ్ సమయాల్లో ఎప్పుడైనా విక్రయించవచ్చు. అంటే తక్షణ లిక్విడిటీ ఉంటుంది. రాబడి మార్కెట్ ధరలతో ముడిపడి ఉంటుంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచితే, ఇండెక్సేషన్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
కౌశిక్ వివరణ: “గోల్డ్ ETF- ధర: రూ.1,00,000, వేస్టేజ్: శూన్యం, లిక్విడిటీ: తక్షణం — మార్కెట్ గంటల్లో ఎప్పుడైనా అమ్మవచ్చు, రాబడి: పారదర్శకం, మార్కెట్‌తో ముడిపడినవి & 3 సంవత్సరాల తర్వాత పన్ను-సమర్థవంతం (ఇండెక్సేషన్ ప్రయోజనాలు).”
సంపద సృష్టికి ఏది ఉపయోగకరం..
ఈ ప్రశ్నకు సమాధానంగా కౌశిక్ ఇలా వివరించారు. చాలా మంది ‘సాంస్కృతిక బంగారం’ను ‘పెట్టుబడి బంగారం’ మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు. సాంస్కృతిక బంగారం భావోద్వేగం, సంప్రదాయంతో ముడిపడి ఉంటుంది, కానీ పెట్టుబడి బంగారం ఆర్థిక వ్యూహంలో భాగం.
Also Read: మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు .. ఎప్పటినుంచి అంటే?
బంగారు గాజులు, హారాలు భావోద్వేగాన్ని ఆకర్షిస్తాయి, కానీ కౌశిక్ వంటి నిపుణులు ఆచరణాత్మకంగా ఆలోచించమని సలహా ఇస్తున్నారు. మీరు బంగారం కొనేటప్పుడు, ఇది సంప్రదాయ ఆభరణాల కోసమా లేదా నిజమైన పెట్టుబడి కోసమా అని ఆలోచించండి. తాత్కాలిక మెరుపు కాకుండా దీర్ఘకాలిక విలువ మీ నిర్ణయాన్ని నడిపించాలి.