ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అమెజాన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఇప్పటికే ప్రైమ్ మెంబర్ షిప్ వివాదం విషయంలో రూ. 22 వేల కోట్లతో సెటిల్ మెంట్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. జూన్ 23, 2019, జూన్ 23, 2025 మధ్య Prime కోసం సైన్ అప్ చేసిన కస్టమర్లకు కోర్టు తీర్పు ప్రకారం ఒక్కొక్కరికి ఆటోమేటిక్ గా $51(రూ. 4990) చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు జులై 23, 2026 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండగానే తాజాగా అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కారణం ఏంటంటే..
తాజాగా కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. కర్నూలుకు చెందిన వీరేష్ అనే యువకుడు.. రీసెంట్ గా అమెజాన్ లో రూ. 80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత డెలివరీ వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసి వీరేష్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తను ఐ ఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేస్తే.. పార్శిల్ లో మాత్రం ఐక్యూ ఫోన్ డెలివరీ చేసింది అమెజాన్.
తన ఆర్డర్ విషయంలో జరిగిన పొరపాటు గురించి వీరేష్ పలుమార్లు పలు మార్లు కస్టమర్ కేర్ తో మాట్లాడాడు. తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. తాను ఆర్డర్ చేసిన ఫోన్ అయిన ఇవ్వాలని, లేదంటే తన డబ్బులు రీఫండ్ చేయాలని కోరాడు. అయినా, అమెజాన్ పట్టించుకోకపోవడంతో విసుగు చెందాడు. చేసేదేమీ లేక, బాధితులు కర్నూలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
విషయం వినియోగదారుల ఫోరంకు చేరడంతో బాధితుడు వీరేష్ కు ఐ ఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు రీఫండ్ ఇవ్వడంతో పాటు రూ. 25 వేలు అదనంగా బాధితుడికి చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమెజాన్ సంస్థ పట్టించుకోలేదు. బాధితుడికి ఎలాంటి పరిహారం అందించలేదు. తాజాగా బాధితుడు మరోసారి వినియోగదారుల ఫోరం మెట్లెక్కాడు. అమెజాన్ సంస్థ పట్టించుకోవడం లేదని వెల్లడించాడు. తమ తీర్పును బేఖాతరు చేసిన అమెజాన్ పై కన్స్యూమర్ ఫోరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ నవంబర్ 21 కు వాయిదా వేసింది.
Read Also: 2.5 బిలియన్ డాలర్లతో అమెజాన్ సెటిల్మెంట్, యూజర్లు డబ్బులు ఎలా పొందాలంటే?