Simple Brain Exercises: విద్యార్థులు చదువుల్లో విజయం సాధించడానికి ఏకాగ్రత అనేది అత్యంత కీలకం. ఏకాగ్రత లేకపోవడం వల్ల చదివిన విషయాలు గుర్తుంచుకోలేకపోవడం లేదా త్వరగా విసుగు చెందడం వంటి సమస్యలు వస్తాయి. శుభవార్త ఏమిటంటే.. మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏకాగ్రత మెరుగుపరచగలిగే అవకాశం కూడా ఉంటుంది. డైలీ లైఫ్ స్టైల్‌లో సులభంగా చేయగలిగే 10 మెదడు వ్యాయామాలు, ఇవి విద్యార్థులకు ఏకాగ్రతను పెంచడానికి ఏ విధంగా సహాయపడతాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. చిన్న చిన్న లక్ష్యాలు, విరామాలు: పిల్లలు ఒకేసారి ఎక్కువసేపు చదవలేరు. కాబట్టి.. 20 నుంచి 30 నిమిషాల చొప్పున చిన్న చిన్న సమయాలు (సెషన్స్) కేటాయించి.. ప్రతి సెషన్ తర్వాత 5 నుంచి 10 నిమిషాల బ్రేక్ ఇవ్వండి. ఈ పద్ధతిని పోమోడోరో పద్ధతి అని కూడా అంటారు. ఇది మెదడు అలసిపోకుండా.. ఉత్సాహంగా పని చేయడానికి సహాయ పడుతుంది.
2. ప్రశాంతమైన చదువుకునే వాతావరణం: పిల్లలు చదువుకునే ప్రదేశం ప్రశాంతంగా, వెలుతురు సరిగా ఉండి, అనవసరమైన శబ్దాలు లేకుండా ఉండాలి. చదువే పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ తప్ప ఇతర ఆట వస్తువులు లేదా దృష్టిని మరల్చే వస్తువులు లేకుండా చూసుకోవాలి.
3. దినచర్యను ఏర్పాటు చేయడం: రోజువారీ పనులు.. ముఖ్యంగా నిద్రపోయే, ఆహారం తినే సమయాల్లో స్థిరత్వాన్ని పాటించడం ముఖ్యం. నిర్దిష్ట షెడ్యూల్ మెదడుకు ఒక క్రమాన్ని అలవాటు చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రతకు అవసరమైన శక్తి లభిస్తుంది.
4. శారీరక వ్యాయామం: శారీరక శ్రమ, ఆటలు మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. ఇది ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు ఆరుబయట ఆడటం లేదా వ్యాయామం చేయడం తప్పనిసరి.
5. సంపూర్ణ ఆహారం, నీరు: పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా.. మెదడు పని తీరుకు నీరు చాలా అవసరం. డీహైడ్రేషన్ ఏకాగ్రతను తగ్గిస్తుంది. కాబట్టి తరచుగా నీరు తాగేలా ప్రోత్సహించాలి.
6. శ్రద్ధతో కూడిన ఆటలు : సుడోకు, క్రాస్‌వర్డ్ పజిల్స్, జ్ఞాపకశక్తి ఆటలు (మెమరీ గేమ్స్) బోర్డు ఆటలు వంటివి ఆడమని ప్రోత్సహించండి. ఈ ఆటలు మెదడుకు సవాలు విసిరి, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతాయి.
7. ధ్యానం, శ్వాస వ్యాయామాలు: ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, కేవలం శ్వాసపై దృష్టి పెట్టే ధ్యానం నేర్పించండి. ఇది వారి మనస్సును శాంత పరచి, దృష్టిని ఒకే చోట నిలిపే సామర్థ్యాన్ని పెంచుతుంది.
8. ఎలక్ట్రానిక్ పరికరాల పరిమితి: టీవీ, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల వాడకాన్ని తగ్గించండి. ఈ పరికరాలు త్వరగా దృష్టిని మరల్చడమే కాకుండా.., మెదడు ఏకాగ్రత సమయాన్ని తగ్గిస్తాయి. చదువుకునే సమయంలో వీటిని దూరంగా పెట్టాలి.
9. ప్రశ్నించడాన్ని ప్రోత్సహించడం: పిల్లలు చదివే ప్రతి విషయాన్ని కేవలం బట్టీ పట్టకుండా.. దాని వెనక ఉన్న అర్థాన్ని ప్రశ్నించమని ప్రోత్సహించండి. విషయాలను అర్థం చేసుకుంటేనే ఏకాగ్రత పెరుగుతుంది.
10. సరియైన నిద్ర: మెదడు పనితీరుకు నిద్ర చాలా ముఖ్యం. పిల్లలకు వయస్సును బట్టి ప్రతి రాత్రి 8 నుంచి 10 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్ర లేమి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.