Bhumana Karunakar Reddy: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం పోలీసు విచారణకు హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై ఇటీవల ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ఆధారాలు చూపాలని, విచారణకు హాజరుకావాలని ఎస్వీయూ పోలీసులు భూమనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూమన విచారణకు హాజరయ్యారు. పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘భూమన కరుణాకర్ రెడ్డికి అధికారులు రహస్యాలు చెబుతున్నారని కొందరు అంటున్నారు. కానీ టీటీడీలో జరుగుతున్న విషయాల గురించి నేను వాస్తవాలు చెబుతుంటే వాటికి సమాధానాలు ఉండవు. దానికి సమాధానం ఏంటంటే నాపై దాడే. కరుణాకర్ రెడ్డి లడ్డూల్లో తినేశాడు, పరకామణిలో తినేశాడు, అవినీతికి పాల్పడ్డాడని నాపై దాడి చేస్తారు. మీ చేతిలోనే అధికారం ఉంది కదా, విచారణ చేసి నేను చెప్పినవి అవస్తవాలు అయితే నన్ను అరెస్ట్ చేయవచ్చు. భూములు ఆక్రమించానని నాపై రెండు రోజులు భారీగా ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడరు. రెండ్రోజులు భౌ భౌ అంటారు.. ఆ తర్వాత అంతా మియావ్ మియావ్ అయిపోతారు. రేపు అరెస్టు చేస్తారు ఎల్లుండి జైల్లో పెడతారంటూ ప్రచారం చేస్తారు. కానీ ఆ తర్వాత ఏం ఉండదు.
టీటీడీలో పనిచేసే వాళ్లందరికీ నాపై ప్రేమాభిమానాలు ఉన్నాయి. వాళ్లపై నాకు ఎంతో అభిమానం ఉంది. నేను టీటీడీ దేవస్థానం స్కూల్, కాలేజీల్లో చదువుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్, ఛైర్మన్ గా పనిచేశారు. టీటీడీ ఉద్యోగులకు నేనేంటో తెలుసు, వాళ్లందరితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కరుణాకర్ రెడ్డి మనుషులను తీస్తేస్తామని అంటుంటారు. అలా అయితే మొత్తం 4700 మందిని తీసేయాలి. నేను టీటీడీ కాంట్రాక్టుల్లో అవినీతి పాల్పడినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపిస్తున్నారు’ అని కరుణాకర్ రెడ్డి అన్నారు.
“టీటీడీ ఛైర్మన్ కు పాలకమండలి సమావేశంలో తప్ప మారే సమయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. మరి ఎవరికి బిల్లులు ఇవ్వాలి, ఎవరి ఇవ్వకూడదనే అధికారం ఎలా ఉంటుంది. కాంట్రాక్టుల్లో బీఆర్ నాయుడు అవినీతికి పాల్పడుతున్నారు. టీటీడీలో కాన్ఫిడెన్షియల్ సమాచారం అంతా నా చేతికి వచ్చేస్తుంది. చరిత్రలో బీఆర్ నాయుడు తరహాలో నిర్ణయాలు తీసుకున్న వారు ఎవరూ లేదు. ఇందులో మతలబు ఏంటి తిరుమలేశా? టీటీడీలో జరుగుతున్న అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితే అడ్డుకుంటారని తెలిసి నా చేతికి కాన్ఫిడెన్షియల్ సమాచారం అందిస్తుంటారు. భవిష్యత్తులో కూడా అందిస్తారు” అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.