Traders Against UPI MDR| చేతిలో నగదు లేకపోయినా ఒక్క స్కాన్‌తో షాపింగ్ పూర్తిచేసే రోజులు ఇవి. చిన్న టీ బిల్లు నుంచి వేల రూపాయల కొనుగోళ్ల వరకు యుపిఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. అయితే రూ.2,000 దాటిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై ప్రభుత్వం ప్రకటించిన 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. ఈ అదనపు ఖర్చు వ్యాపారులపై పడుతుందని ట్రేడర్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగల సీజన్‌లో అమ్మకాలు పెరిగే సమయంలో వ్యాపారులు నగదు చెల్లింపులను ప్రోత్సహిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకొచ్చింది.
భారత్‌లో షాపింగ్‌కు యుపిఐ చెల్లింపులు ఇప్పుడు అత్యంత సాధారణ మార్గాల్లో ఒకటిగా మారాయి. అయితే కొన్ని వ్యాపార యుపిఐ లావాదేవీలపై 0.4 శాతం MDR అమల్లోకి రావడం వ్యాపారుల్లో ఆందోళన పెంచింది. రూ.2,000 దాటిన నిర్దిష్ట పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే ఈ ఛార్జ్ వర్తిస్తుంది. దీంతో కొందరు వ్యాపారులు నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని ట్రేడర్ సంఘాలు చెబుతున్నాయి. పండుగల షాపింగ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఈ మార్పు రావడం మరింత చర్చకు దారితీసింది.
ఢిల్లీ కమలా నగర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నితిన్ గుప్తా ఈ మార్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు.. ఇప్పటికే పలు లావాదేవీ ఖర్చులు, 18 శాతం GST వంటి భారాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు యుపిఐపై కూడా MDR చెల్లించాల్సి వస్తే నగదు చెల్లింపులను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. అయితే డిజిటల్ చెల్లింపులపై ప్రజలు, వ్యాపారులు ఇరు వర్గాలు కూడా బాగా ఆధారపడుతున్నారని గుప్తా అంగీకరించారు. చాలామంది వినియోగదారులు ఇప్పుడు నగదు తీసుకెళ్లడం తగ్గించి యుపిఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమిత్ గుప్తా కూడా అదనపు ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ మార్జిన్లతో పనిచేసే వ్యాపారాలకు ఈ ఛార్జ్ మరింత భారంగా మారవచ్చని ఆయన అన్నారు. ఖాన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ మెహ్రా కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తాల చెల్లింపులకు వ్యాపారులు చెక్కులు, ఇతర బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించవచ్చని ఆయన సూచించారు.
చిన్న రిటైలర్లకు ఒక్కో లావాదేవీపై ఛార్జ్ కంటే మొత్తం నెలవారీ ఖర్చు ముఖ్యమైన సమస్యగా మారుతోంది. కమలా నగర్‌కు చెందిన రిటైలర్ రాజత్ జైన్.. విద్యార్థులు కూడా చిన్న మొత్తాల వస్తువులు కూడా కొనుగోలు చేస్తారని చెప్పారు. షాపింగ్ సమయంలో వారిని రూ.10 లేదా రూ.20 విలువైన వస్తువులు కొనేవారిని అదనపు చెల్లింపులు చేయమని అడగలేమని ఆయన అన్నారు.
అదే సమయంలో చాలామంది వినియోగదారులు నగదుకు బదులుగా యుపిఐనే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.
పండుగల సమయంలో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బహుమతులు వంటి వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి. అందువల్ల యుపిఐ లావాదేవీలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంతోష్ కటారియా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్ పెంచేందుకు వ్యాపారాలు ప్రయత్నిస్తున్న సమయంలో అదనపు ఖర్చు మరింత ఒత్తిడిని కలిగించవచ్చని ఆయన అన్నారు.
రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా కొత్త MDRపై ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల సమయంలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు సాధారణంగా జరుగుతాయని అసోసియేషన్ CEO కుమార్ రాజగోపాలన్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుపై ఛార్జ్ ఉంటే కొందరు వ్యాపారులు నగదును ఎంచుకోవచ్చని ఆయన అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపుల విస్తరణ, ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్ లక్ష్యాలపై ప్రభావం పడవచ్చని రాజగోపాలన్ పేర్కొన్నారు.
Also Read: సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారు? కెమెరా వెనుక జరిగేది ఇదే
కొత్త విధానం ప్రకారం నిర్దిష్ట పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలకే MDR వర్తిస్తుంది.
పర్సన్ టు పర్సన్ యుపిఐ బదిలీలపై ఈ ఛార్జ్ వర్తించదు.
ఈ MDR భారాన్ని వినియోగదారులపై నేరుగా మోపకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నెలకు యుపిఐ QR ద్వారా రూ.1 లక్ష వరకు సంపాదించే చిన్న వ్యాపారులకు మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు 96 శాతం వ్యాపార లావాదేవీలకు ఇప్పటికీ సున్నా MDR కొనసాగుతుంది.
కొత్త MDR వల్ల వ్యాపారులు, వినియోగదారుల చెల్లింపు అలవాట్లలో మార్పు వస్తుందా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. యుపిఐ సౌలభ్యానికి ప్రజలు అలవాటు పడిన నేపథ్యంలో నగదుకు తిరిగి వెళ్లడం ఎంతవరకు జరుగుతుందో చూడాలి. అయితే MDR ప్రభావం వ్యాపారుల ఖర్చులు, పండుగల అమ్మకాలు, చెల్లింపు విధానాలపై ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
Also Read: బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?