Digital Payment Fraud: ఈ రోజుల్లో చేతిలో నగదు లేకపోయినా ఫోన్ ఉంటే చాలు.. దాదాపు అన్ని పనులూ చేసేస్తున్నాం. షాపింగ్ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు UPI, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే డిజిటల్ చెల్లింపులు పెరిగినట్టే సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. పొరపాటున మోసగాళ్ల ఖాతాలోకి డబ్బులు వెళ్లినా, మనకు తెలియకుండా ఖాతా నుంచి నగదు మాయమైనా తిరిగి తెచ్చుకోవడం అంత సులభం కాదు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసం జరిగితే డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది.
కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 5,83,291 డిజిటల్ చెల్లింపుల మోసాలు నమోదయ్యాయి. వీటి ద్వారా బాధితులు మొత్తం రూ.3,588.22 కోట్లు నష్టపోయారు. కానీ తిరిగి రికవరీ చేయగలిగింది కేవలం రూ.238.83 కోట్లు మాత్రమే. అంటే పోయిన ప్రతి రూ.100లో సుమారు రూ.6.66 మాత్రమే తిరిగి వచ్చాయి.
ఈ గణాంకాల ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాల్లో డబ్బు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంది. ఈ కాలంలో 2,42,562 కేసులు నమోదవగా, రూ.1,730.14 కోట్లు నష్టపోయారు. ఇందులో తిరిగి వచ్చింది కేవలం రూ.24.83 కోట్లు మాత్రమే. అంటే రికవరీ రేటు 1.44 శాతంగా ఉంది.
ఇక క్రెడిట్ కార్డు మోసాల్లో 2,43,849 కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా రూ.1,447.27 కోట్లు నష్టం వాటిల్లగా, రూ.177.78 కోట్లు తిరిగి వచ్చాయి. అంటే 12.28 శాతం రికవరీ నమోదైంది. ఇక UPI మోసాలకు సంబంధించి 457 కేసుల్లో రూ.2.13 కోట్లు నష్టం జరగ్గా, అందులో రూ.5 లక్షలు మాత్రమే తిరిగి వచ్చాయి. ఈ లెక్కన UPI రికవరీ రేటు 2.35 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే ఈ మూడింటిలో క్రెడిట్ కార్డుల రికవరీ మెరుగ్గా ఉండగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అత్యల్పంగా ఉంది.
మోసం జరిగిన వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేశారా? డబ్బు మరో ఖాతాకు వెళ్లకముందే నిలిపివేయగలిగారా? అనే అంశాలపై రికవరీ ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో కొన్ని సందర్భాల్లో ఛార్జ్‌బ్యాక్ ద్వారా డబ్బు వెనక్కి పొందే అవకాశం ఉంటుంది. కానీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపిన డబ్బు వెంటనే ఇతర ఖాతాలకు బదిలీ అయితే తిరిగి తెచ్చుకోవడం కష్టమవుతుంది.
డిజిటల్ మోసాలను తగ్గించేందుకు RBI ‘స్టాప్ స్విచ్’, పెద్ద లావాదేవీలకు ‘ట్రస్టెడ్ పర్సన్’ అనుమతి వంటి కొత్త సదుపాయాలను ప్రతిపాదించింది. ఈ నిబంధనలు 2027 జూలై 1 నుంచి అమల్లోకి రావచ్చని పేర్కొంది. అయితే మోసం జరిగినప్పుడు కొత్త నిబంధనల కోసం ఎదురుచూడకండి. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. లావాదేవీల మెసేజ్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఆధారాలుగా భద్రపరచుకోండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే అవకాశం అంత మెరుగ్గా ఉంటుంది.
Read Also: నెలకు 10000 SIPతో కోటీశ్వరులు కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?