FSSAI Water Testing: భారత ఆహార భద్రత సంస్థ (FSSAI) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతను పరీక్షించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తాగునీటి నమూనాలను సేకరిస్తున్నామని వాటికి సంబంధించిన ల్యాబ్ పరీక్షల ఫలితాలు మరో రెండు నెలల్లో వెల్లడవుతాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ రజిత్ పున్హానీ తెలిపారు. ప్రముఖ బ్రాండ్ ‘బిస్లరీ’ (Bisleri) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఇటీవల బయటపడిన నేపథ్యంలో మిగతావాటిపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) ఈవెంట్ లో పాల్గొన్న ఆహార భద్రత సంస్థ సీఈఓ రజిత్ పున్హానీ.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్‌పై కూడా త్వరలోనే తనిఖీలు ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఆహారాన్ని ప్యాక్ చేసే కవర్లు, బాటిళ్లు ఖచ్చితంగా ‘ఫుడ్ గ్రేడ్’ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిందేనన్నారు. అటు ఆహార ఉత్పత్తుల లేబుల్స్‌పై తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా ప్యాకేజ్డ్ వాటర్‌పై చేపడుతున్న తనిఖీలపై సీఈఓ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఇప్పటికే దేశవ్యాప్తంగా మొదలైందన్నారు. ‘మనది చాలా పెద్ద దేశం. కాబట్టి నమూనాల సేకరణ, ల్యాబ్ పరీక్షల ఫలితాలు రావడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుంది’ అని అంచనా వేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం, వారికి సురక్షితమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. గత ఏడాది కాలంగా పాలు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, ఎనర్జీ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ వంటి వాటిపై వరుసగా తనిఖీలు చేపట్టామని ఈ సందర్భంగా రజిత్ పున్హానీ అన్నారు. ఈ క్రమంలోనే తాగునీటిపై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.
మరోవైపు ‘బిస్లరీ ఇంటర్నేషనల్’ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎప్పుడు ప్రారంభిస్తారన్న ప్రశ్నకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ సమాధానం ఇచ్చారు. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియనే అని.. నిబంధనల ప్రకారమే ఈ విషయంలో ముందుకు వెళ్తామని పున్హానీ బదులిచ్చారు. ఇటీవల గోవా బిస్లరీ ప్లాంట్ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో పరిమితికి మించి ‘బ్రోమేట్’, ‘పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (PAHs) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇవి క్యాన్సర్ కారకాలు కావడంతో ఆదివారం (నవంబర్ 22) బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది. మరోవైపు తమ తాగునీరు వినియోగానికి పూర్తిగా సురక్షితమేనని బిస్లరీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
Also Read: మనుషుల్లా కనిపించే రెప్లికెంట్స్… తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్