Nikesh Kumar’s Illegal Wealth: తెలంగాణ నీటి పారుదలశాఖ అధికారి నిఖేష్ కుమార్ ఆస్తుల చిట్టా పెరుగుతోందా? కేవలం డబ్బు కాకుండా, భూములు, బంగారు నగలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయా? ఆయనకు సంబందించి 18 లాకర్లు ఓపెన్ చేశారా? ఈ వ్యవహారంలో సొంత ఫ్రెండ్‌ని ఇరికించాడా? ఇంకా ఓపెన్ కావాల్సిన లాకర్లు ఉన్నాయా? అవుననే సమాధానం వస్తోంది.
నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ ఆస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఏసీబీ నిర్వహించిన సోదాల్లో 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి. సోదాల్లో ఆయన ఆస్తులను చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోయారు. విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్‌లు మాత్రమే కాకుండా బ్యాంకు లాకర్లు తాళాలు బయటపడ్డాయి. నిఖేష్ కుమార్‌తోపాటు బంధువుల ఇళ్లలో దాదాపు 23 చోట్ల సోదాలు చేపట్టారు. గండిపేట్ సమీపంలోని పెబుల్ సిటీ ప్రాంతంలో ఉంటున్నారు.
సోదాలు చేసిన రోజు నిఖేష్‌కుమార్ ఇంట్లో బ్యాంకు లాకర్లు బయటపడ్డాయి. సోదాల తర్వాత ఇప్పుడు బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు 18 లాకర్లు ఓపెన్ చేశారు. నిఖేశ్ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు. దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్ ఇతర ఆభరణాలు ఉన్నాయి. మిగతా 16 కుటుంబ సభ్యులు, స్నేహితులపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మరికొన్ని చోట్ల స్థిరాస్తుల దస్తా వేజులు బయట పడ్డాయి.
అరెస్టుకు మూడు వారాల కిందట తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్‌ని నమ్మించాడట నిఖేష్ కుమార్. అతడి బ్యాంకు లాకర్లలో ఆభరణాలు పెట్టినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆయన కూడబెట్టిన మరికొన్ని భూముల పత్రాలు ఉంటాయేమోనని అనుమానిస్తున్నారు. సోదాల సమయంలో నిఖేష్ కుమార్ పేరు మీద కేవలం రెండు లాకర్లు మాత్రమే దొరికాయి. మిగతావి ఫ్రెండ్స్, బంధువుల పేర్ల మీద ఉన్నాయి. ఈ క్రమంలో నిఖేష్ కుమార్ బాగా క్లోజ్‌గా ఉండేవారికి గుర్తించే పనిలోపడ్డారు.
ALSO READ: లగచర్ల దాడి కేసు.. కీలక రహస్యాలు ఐఫోన్‌లో..
ఆయనను 10 రోజులపాటు కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆయనను దగ్గర పెట్టి ఆయా లాకర్లు తెరవాలన్నది ఆలోచన. ఆయా లాకర్లు ఓపెన్ అయితే ఆస్తులు ఇంకా పెరిగే అవకాశముందని అంటున్నారు. దీనికితోడు నిఖేష్ బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై ఫోకస్ చేశారు.
తాము గుర్తించిన ఖాతాలను స్తంభింపజేయాలని ఇప్పటికే అధికారులకు లేఖ రాసింది ఏసీబీ. మొత్తం ఐదు ఐఫోన్లను గుర్తించారు. వాటిని విశ్లేషించేందుకు ల్యాబ్‌కు పంపారు. అరెస్టయిన వెంటనే నిఖేష్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇటు బెయిల్.. అటు కస్టడీ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. ఈ లెక్కన ఏఈఈ బాగానే కూడబెట్టినట్టు అర్థమవుతోంది.