Anantapur Crime: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో జరిగిన హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నేమకల్లుకు చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను కాలువలోకి తోసివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల బాలిక చంద్రమ్మ మృతదేహం లభ్యమవగా, మరో బాలిక అనసూయ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం కల్లప్ప తన ఇద్దరు కూతుర్లను కర్ణాటకలోని ఓ ఆలయానికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అనంతరం కర్ణాటకలోని తుంగభద్ర లోలెవల్ కాలువ వద్దకు వెళ్లి ఇద్దరు బాలికలను కాలువలోకి తోసివేసి తిరిగి గ్రామానికి వచ్చాడని విచారణలో వెల్లడైంది. ఇంటికి వచ్చిన తర్వాత కూతుర్లు కనిపించకపోవడంతో తల్లి శిల్పమ్మతో పాటు గ్రామస్తులు కల్లప్పను నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానంగా తానే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని కల్లప్ప అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కల్లప్పను అదుపులోకి తీసుకుని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కాలువలో తొమ్మిదేళ్ల చంద్రమ్మ మృతదేహం లభ్యమైంది. మరో బాలిక అనసూయ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారులపై తండ్రే ఈ విధమైన నేరానికి పాల్పడటం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ALSO READ: Fire Accident: ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న అగ్నికీలలు