పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప హైస్కూల్లో గణితం బోధించే ఉపాధ్యాయుడు బి. సుధీర్ బాబు వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమ్మిది, పదో తరగతి విద్యార్థినులను చదువు పేరుతో అసభ్యకరంగా తాకుతున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రులు, హైస్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ నాగేంద్ర నేరుగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి, సుధీర్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, సుధీర్ బాబు మాత్రం పిల్లలు చదవనందున భుజంపై తట్టానే తప్ప, లైంగిక వేధింపులకు పాల్పడలేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
ఈ విషయంపై హెచ్‌ఎం మల్లికార్జునరావు కూడా స్పందించారు. ఉపాధ్యయుడు సుధీర్ బాబు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయం మొదట తన దృష్టికి రాలేదన్నారు. పేరెంట్ కమిటీ ముందు రోజు మాత్రమే టీచర్ల ద్వారా విషయం తెలిసిందని అన్నారు.