Boduppal Crime: విలువైన ఆస్థి చేజారిపోతుందనే అక్కసతో.. సవతి తల్లి దారుణానికి పాల్పడింది. ఇద్దరు వ్యక్తుల సాయంతో కూతురిని హత్యచేసింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మేడ్చల్ జిల్లా మేజిపల్లి పోలీస్టేన్ పరిధిలో డిసెంబర్ 7న కనిపించకుండా పోయిన మహేశ్వరి అనే యువతి హత్యకు గురైనట్లుగా పోలీసులు తేల్చారు. ఆమెను చంపింది ఎవరో కాదు తల్లే.. కాకపోతే సొంత తల్లి కాదు సవతి తల్లి.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీ నగర్‌లో నివాసం ఉంటున్న 26 ఏళ్ల జాటోత్ మహేశ్వరి అనే యువతి గత డిసెంబర్ 7వ తారీఖున అదృశ్యం అయింది. ఈ నెల 2న తండ్రి జాటోత్ పీనా మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశాడు.
కాగా, పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం వంగమర్తి ప్రాంతంలో శవంగా తేలింది మహేశ్వరి. సవతి తల్లి లలిత కుట్రతో మహేశ్వరి హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. లలిత మేనమామ రవితో పాటు మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని లలిత హతమార్చింది.
జాటోత్ పీనా మొదటి భార్య కూతురు మహేశ్వరి. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. తల్లి వద్ద కుమారుడు, తండ్రి పీనా వద్ద మహేశ్వరి ఉంటుంది. పీనా, లలితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. పీనాకు బోడుప్పల్ ప్రాంతాలో రెండు ఇండ్లు ఉన్నాయి. మహేశ్వరికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకొని, ఒక ఇళ్లు ఇవ్వాలని తండ్రి పీనా నిర్ణయించాడు. అయితే, రెండు ఇండ్లు తన కూతురికే కావాలని సవతి తల్లి లలిత ప్లాన్ చేసింది. మహేశ్వరిని అంతం చేసేందుకు తన మేన బావ రవితో కలిసి ప్లాన్ చేసింది. లలిత, రవి, మరో వ్యక్తి కలిసి గత డిసెంబర్ 7న మహేశ్వరి తండ్రి పీనా డ్యూటీకి వెళ్లిన సమయంలో బోడుప్పల్ ప్రాంతంలో మహేశ్వరిని హత్య చేశారు.
రవి గ్రామం అయిన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి దగ్గరలోని నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం, వంగమర్తి గ్రామ శివారులో అదే రాత్రి 11 గంటల సమయంలో మహేశ్వరి డెడ్ బాడీని పూడ్చిపెట్టారు. సుమారు నాలుగు నెలలు కావొస్తున్నా మహేశ్వరి జాడ తెలియక పోవడంతో పీనా మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో సవితి తల్లి లలిత, ఆమె మేనబావ రవి, మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని హత్య చేసినట్లు తేల్చారు. నిందితులు చెప్పిన సమాచారంతో వంగమర్తిలో మహేశ్వరి మృతదేహం లభించింది. నాలుగు నెలల క్రితమే మహేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మాయం చేసినట్టు అంగీకరించారు.
Also Read: కూతుర్ని గొంతు కోసి చంపి, శవాన్ని బాత్రూంలో దాచిన తండ్రి.. కారణం అదేనా?
మేడిపల్లి పోలీసులు వంగమర్తి వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.