Road Accident: మహబూబాబాద్ జిల్లాలో లారీ భీభత్సం సృష్టించింది. ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదం.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న గ్రానైట్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళ్తే.. లారీ కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్ వైపు.. గ్రానైట్ బండలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ అతివేగంగా వెళ్తూ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి.. ఇంటి గోడను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. గోడ కూలిపోవడంతో లోపల నిద్రిస్తున్న లక్ష్మీ గాయపడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు మీద పడిపోయిన గ్రానైట్ రాళ్లను క్రేన్‌ల సాయంతో తొలగించారు.
ప్రస్తుతం గాయపడిన లక్ష్మీ పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనతో నాంచారి మడూరు గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజలు ఇలాంటి లారీ బీభత్సాలు మరలా జరగకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆర్టీసీ ఢీ.. స్పాట్‌లో17 మంది మృతి
కాగా వరుస లారీ ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. తాజాగా.. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఆర్టీసీ బస్సు- టిప్పర్ లారీ ఢీకొనడంతో 19 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీకి సూచించారు.. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.