Coimbatore Gang Rape Case: తమిళనాడులోని కోయంబత్తూరులో గ్యాంగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు పోలీసులపై దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ముగ్గురు నిందితులకు గాయలయ్యాయి. వారిని అరెస్టు చేసిన తర్వాత, ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు
కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఆదివారం రాత్రి కారులో ఉన్న ఓ విద్యార్థిని-ఆమె ఫ్రెండ్‌పై కొందరు యువకులు దాడి చేశారు. ఆ తర్వాత ఫ్రెండ్‌ని కొట్టి యువతిని అపహరించారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
సోమవారం ఓ ఆలయం వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు చుట్టుముట్టారు. తాము దొరికిపోతామని భావించారు ఆ ముగ్గురు నిందితులు. ఈ క్రమంలో తమ వద్దనున్న వేట కొడవళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ చేతికి, మణికట్టు వద్ద గాయాలు అయ్యాయి. పరిస్థితి గమనించిన పోలీసులు, ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. వారి కాళ్లకు గాయాలు అయ్యాయి.
పోలీసులపై నిందితులు దాడి
గాయపడిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు. నిందితులు తవాసి, కరుప్పసామి, కాళీశ్వరన్‌లు శివగంగై జిల్లాకు చెందినవారు. కోయంబత్తూరులో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. గతంలో వీరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
ఈ కేసు వ్యవహారం, ఆపై కాల్పులపై రాజకీయ దుమారం రేగింది. డీఎంకే ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. స్టాలిన్ పాలనలో మహిళల భద్రత కరువైందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో మహిళల భద్రతలో తమిళనాడు దేశంలో టాప్ లో ఉందన్నారు.
ALSO READ: ఒకేసారి ప్రమాదానికి గురైన మూడు ట్రావెల్ బస్సులు
మహిళలపై నేరాలు తగ్గడం లేదనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు కేంద్రమంత్రి మురుగన్. ఈ ఘటన డీఎంకే పాలనకు మరో మచ్చన్నారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్. డీఎంకే అధికారంలోకి వచ్చాక సంఘ విద్రోహులకు భయం లేకుండా పోయిందన్నారు. మరి ప్రతిపక్షాల ఆరోపణలపై అధికార డీఎంకె ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.