Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫ్యామిలీలో నలుగురు ఆత్మహత్య వెనుక అసలేం జరిగింది? ఫ్యామిలీ సమస్యలా? అప్పుల బాధ కారణమా? ఆరోగ్య సమస్యలా? వంటి కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. సంచలనం రేపిన ఈ ఘటన హబ్సిగూడలో జరిగింది.
హైదరాబాద్‌లో ఫ్యామిలీ సూసైడ్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి-కవితారెడ్డి దంపతులు హబ్సిగూడలోని మహేశ్వర్‌నగర్ ప్రాంతంలో ఉంటున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి దూరమయ్యాడు. గడిచిన ఆరు నెలల నుంచి ఉద్యోగం లేక ఆ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు శ్రీతరెడ్డి తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడుకు విశ్వంత్‌రెడ్డి ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుమారుడు విశ్వంత్‌రెడ్డికి విష మిచ్చి చంపేశారు. కుమార్తె శ్రీతరెడ్డికి ఉరేసి చంపినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చివరకు చంద్రశేఖర్‌రెడ్డి-కవితారెడ్డి కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ALSO READ: ఎన్నారై మహిళ కేసులో న్యూ ట్విస్ట్
సోమవారం రాత్రి చంద్రశేఖర్ దంపతులకు బంధువులు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే సమీపంలోని బంధువులు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. తలుపు ఎంత కొట్టినా తీయలేదు. చివరకు ఇరుగుపొరుగు వారి సహాయంతో కిటికీ తలుపులు ఓపెన్ చేశారు. రూమ్‌లో నలుగుర్ని చూసి షాకయ్యారు.
గదిలో మంచంపై పిల్లలిద్దరు చనిపోయినట్టు కన్పించారు. చంద్రశేఖర్ రెడ్డి- కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించడంతో బంధువులు షాకయ్యారు. కాసేపు వారికి నోటి వెంట మాట రాలేదు.
సూసైడ్ లేఖలో ఏముంది?
స్థానికులు సమాచారం మేరకు ఓయూ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మా చావుకి ఎవరూ కారణం కాదని, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించాలని అందులో రాసుకుంది.
అంతేకాదు కెరీర్, శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో ఉంది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అత్తింటి వెర్షన్
చంద్రశేఖర్‌రెడ్డి అత్తింటివారు ఏమంటున్నారు? మా అల్లుడికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు తమకు చెప్పలేదన్నారు. ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. కూతురు కాపురంలో ఏనాడూ గొడవలు పడిన సందర్భం లేదన్నది అత్తింటి వెర్షన్. మమ్మల్ని అందరినీ శోక సంద్రంలో ముంచేసి వెళ్లిపోయారని అన్నారు. దేవుడు మాకు తీరని అన్యాయం చేశాడని కన్నీరు మున్నీరు అయ్యారు.
పోలీసులు ఏమన్నారు?
పోలీసుల వెర్షన్ ఏంటంటే.. హబ్సిగూడలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు రాత్రి మాకు సమాచారం వచ్చిందన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. తొలుత కుమార్తె, కుమారుడికి ఉరివేసినట్టు ప్రాథమికంగా తేలిందన్నారు. సమీపంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆర్థిక కష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కారణాలు ఏమైనా ఉండవచ్చు.. సమస్యలను అధిగమించాలే గానీ ఆత్మహత్యలకు పాల్పడడం కరెక్టు కాదని అంటున్నారు కొందరు వైద్యులు. సమస్యలకు చావు కారణమైతే.. పుట్టినవాళ్ల కంటే రోజూ చనిపోయిన సంఖ్య పెరుగుతూ పోతోందని అంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన దారుణమైన ఈ ఘటనపై చాలామంది కంటతడి పెడుతున్నారు.