Eight youth died in Gujarath..when they went to immerse lord Ganesha: సంతోషంగా యువకులు పండుగ జరుపుకునేవేళ..ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు ప్రాణాలు వదిలిన దుర్ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. దేశమంతటా గణేశుని నిమజ్జనాలు జరుగుతున్నాయి. పది రోజుల అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే చివరి రోజు రద్దీని దృష్టిలో పెట్టుకుని కొందరు రెండో రోజు నుంచే నిమజ్జనాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినాయకుడికి వారం రోజులు పూజ చేసి శుక్రవారం అర్థరాత్రి కొందరు యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం నదిలోకి తీసుకెళ్లారు.
స్నేహితుని రక్షించబోయి..
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ జిల్లా దేకాం తాలుకూ వస్నాసోగ్తి గ్రామానికి చెందిన యువకులు వినాయకుడిని ప్రతిష్టించి వారం రోజులు ఘనంగా పూజలు నిర్వహించారు. వారం రోజుల అనంతరం శుక్రవారం సంబరాలు జరుపుతూ గణేశుడికి వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరిపారు. ఊరేగింపు అనంతరం దగ్గరలోని మెష్వా నదికి వెళ్లారు. అయితే అందులో ఉత్సాహం ఆపుకోలేక ఓ యువకుడు నదిలో ఈత కొట్టేందుకు దిగాడు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇక అతని స్నేహితులు అతనిని కాపాడటానికి వారు కూడా నదిలో దిగారు. వారిలో ఎనిమిది మంది నదిలో కొట్టుకుపోయారు. మొత్తం చనిపోయిన ఎనిమిది మందిని ఒడ్డుకు చేర్చారు రెస్క్యూ టీమ్.
ప్రధాని దిగ్భ్రాంతి
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. కాగా ఈ సంఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. తన అధికారిక ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇది చాలా విషాదకర సంఘటన అని..తనని తీవ్రంగా కలచివేసిందని..దైవ కార్యానికి వెళ్లి ఇలా దుర్ఘటన పాలవ్వడం నిజంగా విచారకరం అని తన సంతాపాన్ని తెలిపారు. నిమజ్జనం వేళ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని..సూచించారు.