Tirupati Drug Case: చదువుకోవాల్సిన వయసులో మత్తుకు బానిస అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మత్తు ఇంజక్షన్లు తీసుకోవడం ఎక్కడబడితే అక్కడ కలకలం రేపుతోంది. మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును ఎంతోమంది యువత చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఏది తప్పు.. ఏది ఒప్పో తెలుసుకోలేని వయసులో మత్తుకు బానిస అవుతున్నారంటే.. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టినట్లుగా తెలుస్తోంది.
తాజాగా తిరుపతిలో మత్తు ఇంక్షన్లు తీసుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నగరంలోని ఇరిగేషన్ ఆఫీస్ వెనుక ఉన్న పాడుబడ్డ బంగ్లాలో ఇద్దరు యువకులు మత్తు ఇంజక్షన్స్, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు డ్రోన్ కెమరాతో గుర్తించారు. వెంటనే చాకచక్యంగా పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జిల్లాలో డ్రగ్స్ విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ.
పట్టుబడ్డ యువకుల వద్ద పోలీసులు రెండు మత్తు ఇంజెక్షన్స్, డ్రగ్స్ పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని మెడికల్ పరీక్షల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
దేశంలో డ్రగ్స్ విక్రయాలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనించాలి. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సూచించారు.
Also Read: హైదరాబాద్ అభివృద్ధికి ముప్పై ఏళ్ళు.. విశాఖకు పదేళ్ళు చాలు: లోకేష్
తిరుపతిలో తొలిసారిగా డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించడంలో.. డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవిష్యత్తులో పట్టణంలోని పార్కులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, విద్యార్థుల హాస్టళ్ళ ప్రాంతాలు వంటి చోట్ల నిరంతర డ్రోన్ పర్యవేక్షణ కొనసాగించనున్నారు.