Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. చాకచక్యంగా దర్యాప్తు జరిపిన దుండిగల్ పోలీసులు 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు. బంగారం కోసం నిందితురాలు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా విచారణలో వెల్లడైంది. మేడ్చల్ సబ్ డివిజన్ ఏసీపీ శంకర్ రెడ్డి బుధవారం మేడ్చల్ సీసీఎస్ ఏసీపీ నాగేశ్వరరావుతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
దుండిగల్ ప్రాంతంలోని చర్చి గాగిలాపూర్ వాస్తవ్యురాలైన సుశీలమ్మ (85) ఒంటరిగా నివాసముంటోంది. ఈనెల 2న మధ్యాహ్నం సమయంలో సుశీలమ్మ ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. సోఫాలో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో దుండిగల్ సీఐ సతీష్, డీఐ బాలరెడ్డి, ఎస్ఐలు ఈశ్వర్, దాలినాయుడు, శంకర్ తోపాటు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీం సిబ్బందిని పిలిపించి ఆధారాలను సేకరించారు. సుశీలమ్మ ఇంటి పక్కనే నివాసముంటున్న శ్రీకర్ రెడ్డి తన ఇంటికి పెట్టించిన సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. దానిని విశ్లేషించగా ఓ మహిళ సుశీలమ్మ ఇంటి గేటు ముందు తచ్చాడుతూ కనిపించింది. ఈ ఆధారంతో దర్యాప్తును ముందుకు నడిపించగా ఆ మహిళ గతంలో చర్చి గాగిలాపూర్ ప్రాంతంలో నివాసమున్న కవిత అని నిర్ధారణ అయ్యింది.
కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను ప్రశ్నించగా తాను చర్చి గాగిలాపూర్ కు వచ్చిన మాట నిజమే కానీ సుశీలమ్మ ఇంటికి వెళ్లలేదని చెప్పింది. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడ్డ దుండగులు సుశీలమ్మ మొబైల్ ఫోన్ ను కూడా తీసుకుని పరారైనట్టుగా గుర్తించిన దర్యాప్తు బృందం దాని నెంబర్ ఆధారంగా విచారణ చేశారు. దీంతో కవిత ఇంటి పక్కన భూమిలో గొయ్యి తవ్వ ఆ ఫోన్ ను పాతి పెట్టినట్టుగా వెల్లడైంది. దానిని స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు ఈసారి తమదైన శైలిలో ప్రశ్నించగా కవిత చేసిన నేరాన్ని అంగీకరించింది.
గతంలో సుశీలమ్మ తన ఇంటి మరమ్మత్తు పనులు చేయించిన సమయంలో కవిత పదిహేను రోజులపాటు అక్కడ పని చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ సమయంలోనే సుశీలమ్మ చెవులకు ధరించిన బంగారం కమ్మలు, వేలి ఉంగరంపై ఆమె దృష్టి పడినట్టుగా తేలింది. వాటిని దోచుకోవాలన్న లక్ష్యంతోనే ఈనెల 2న మధ్యాహ్నం సమయంలో కవిత చర్చి గాగిలాపూర్ కు వచ్చినట్టుగా తెలిసింది. పరిచయం ఉన్న నేపథ్యంలో సుశీలమ్మ ఎలాంటి అనుమానం లేకుండా కవితను ఇంట్లోకి రానిచ్చినట్టుగా వెల్లడైంది. సుశీలమ్మ సోఫాలో కూర్చుని మాట్లాడుతుండగా అవకాశం చూసుకుని కవిత సుత్తితో ఆమె తలపై బలంగా మోది దారుణంగా హత్య చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Charmy kaur : స్లమ్ డాగ్ సక్సెస్ కోసం అక్కడ పూజలు చేయించిన ఛార్మి.. సక్సెస్ వచ్చేనా?
సుశీలమ్మ హత్య అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు, వేలి ఉంగరాన్ని దోచుకుని కవిత అక్కడి నుంచి ఉడాయించినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె నుంచి చెవి కమ్మలు, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసులోని మిస్టరీని ఛేధించి నిందితురాలిని అరెస్ట్ చేసిన సిబ్బందిని ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు. ఇక, తన ఇంటి రక్షణతోపాటు సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన శ్రీకర్ రెడ్డిని సన్మానిస్తామని తెలిపారు.
Also Read: YS Jagan: అంబటి ఫ్యామిలీకి జగన్ పరామర్శ.. ఎవరినీ వదలనంటూ.. చంద్రబాబుకు మాస్ వార్నింగ్!