Black Magic: నేటి 21వ శతాబ్దపు కాలంలోనూ అంధయుగ విశ్వాసాలు ఇంక కొనసాగుతుండటం విషాదం. చేతబడి అనుమానంతో ఒకే కుటంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. వారు చేతబడి చేయడం వల్లే ఊరిలోని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని, వ్యక్తిగతంగా తాము ఎంతో నష్టపోతున్నామని వారంతా గుడ్డిగా నమ్మారు. అందుకే చేతబడి చేస్తున్నట్టు అనుమానించిన ఆ కుటుంబం ఇంటిలోకి రాత్రిపూట చొరబడ్డారు. కర్రలు, గొడ్డలతో దూరి దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గడ్ కావడం.. అదీ సుక్మా జిల్లాలో ఈ ఘటన జరగడంతో హత్యల వెనుక మావోయిస్టు హస్తం ఉన్నదా? అనే అనుమానాలు వచ్చాయి. స్పాట్‌కు వచ్చిన పోలీసు అధికారులు ఆ అనుమానాలను తోసిపుచ్చారు. ఈ ఘటన వెనుక మావోయిస్టుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇది అంధవిశ్వాసాలతో చేతబడిని నమ్మి హత్యలకు పాల్పడిన ఘటన అని వివరించారు.
మరణించిన వారికి, నిందితులకు గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎత్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామస్తులను ఘటన గురించి ప్రశ్నించగా.. వారు చేతబడి చేసేవారని నమ్ముతున్నట్టు తెలిపారు. వారి క్షుద్రపూజల వల్లే తమ గ్రామంలో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, చాలా మంది వ్యక్తిగతంగా నష్టపోతున్నారని నమ్మామని వివరించినట్టు ఎస్పీ కిరణ్ జీ చవాన్ తెలిపారు.
Also Read: Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?
ఆదివారం కొందరు వారి ఇంటిలోకి వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరిని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. నిందితులు సవలం రాజేశ్, సవలం హిడ్మా, కరం సత్యం, కుంజ్ ముకేశ్, పొడియం ఎంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి చేతిలో మౌసం కన్నా(34), ఆయన భార్య మౌసం బిరి, మౌసం బుచ్చా(34), ఆయన భార్య మౌసం అర్జో (32), మరో మహిళ కర్కా లచ్చి (43)లు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలు పెట్టినట్టు వారు తెలిపారు. తాను స్వయంగా క్రైమ్ సీన్‌కు వెళ్లానని, కర్రలు, గొడ్డలతో దాడి జరిగినట్టు గుర్తించామని ఎస్పీ చవాన్ వివరించారు.
ఈ నెల 12వ తేదీన ఇలాంటి ఘటనే ఇదే రాష్ట్రంలోని బలోదబజార్, భాతపారా జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తారనే అనుమానంతో శిశువు సహా నలుగురు కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకున్నారు.