సూర్యాపేట, స్వేచ్ఛ : రాష్ర్టంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్నఇసుక లారీని, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు తీసువస్తోంది. ఈ క్రమంలో ఐలాపురం వద్ద తెల్లవారు జామున రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని, బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మందికి గాయలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 32 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ రవి ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో..
లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. సోంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26), అతడి స్నేహితుడు నాగరాజు (25) కొంపల్లి వెళ్లి వన్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకు వద్దకు రాగానే హైదరాబాద్ మెదక్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అల్లీపూర్ గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గాప్రసాద్‌కు భార్య సారిక, ఓ కూతురు, నాగరాజుకు భార్య మేఘమాలతో పాటు ఓ కూతురు ఉంది. మృతదేహాలను నర్సాపూర్ పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామనికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: ప్రేమ వివాహం చేసుకున్న జంట.. 20 ఏళ్ల తర్వాత కోడలిని చంపేసిన అత్తామామలు..