Crime News: మహబూబాబాద్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది. నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్నదన్న కనికరం లేకుండా 65 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం జరిపి కిరాతకంగా హత్య చేశారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళలు, వృద్ధుల భద్రతపై ఆందోళన రేకెత్తించింది.
మృతురాలి పేరు కల్లెపు పద్మ. ఈమె స్వగ్రామం ఇదే జిల్లాలోని కురవి మండలం తిర్లపాలెం. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త గతంలోనే చనిపోవడంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లు చేసి తన బాధ్యతలను నెరవేర్చింది. వయసు పైబడటంతో ప్రస్తుతం రామన్నగూడెంలోని తన రెండో కుమార్తె వద్ద ఉంటోంది. అయితే కుటుంబ పోషణ కోసం, జీవనోపాధి వెతుక్కుంటూ రెండో కుమార్తె కుటుంబం హైదరాబాద్ నగరానికి వలస వెళ్లింది. దీంతో కల్లెపు పద్మ ఆ ఇంట్లో ఒంటరిగానే జీవిస్తోంది.
ఘోరానికి ఒడిగట్టిన దుండగులు
వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. వయసును కూడా లెక్కచేయకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు స్థానికులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే నెల్లికుదురు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వృద్ధురాలిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.