Medak News: గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. మెదక్ జిల్లా మనోహరబాద్ టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. ఎట్టకేలకు ఆ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు, 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడినవారిలో ఆరుగురు ఉన్నారు. వారిలో ఇద్దరు యువకులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. గంజాయి తరలింపుపై పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు.
రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు
గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారికి లభించిన సమాచారం ఆధారంగా జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయినా సరే స్మగ్లర్లు వెనక్కి తగ్గలేదు. ఏదో విధంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులకు దొరక్కకుండా కుటుంబసభ్యుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న గ్యాంగ్‌ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని టోల్‌గేట్ వద్ద రాత్రి జరిగింది.
నిందితులు హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్ట ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శివారు ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు పోలీసులు. అయితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌గేట్ వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తప్పించుకున్నారు.
పోలీసుల వాహనంపై దాడి
ఈ విషయాన్ని సికింద్రాబాద్‌లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ బృందం మెదక్ జిల్లా తూప్రాన్ టోల్‌గేట్ వద్ద మొహరించింది. అల్లాపూర్ శివారులోని టోల్‌గేట్ వద్ద గంజాయితో వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీలు చేసేందుకు ప్రయత్నించారు. నిందితులు ప్రయాణిస్తున్న కారు.. పోలీసుల కారును బలంగా ఢీకొట్టింది.
ALSO READ: తుని ఘటనపై డీఎస్పీ బయటపెట్టిన షాకింగ్ నిజాలు
వేగంగా వెళ్తున్న క్రమంలో స్మగ్లర్ల వాహనం బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ఉన్న ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాంద్‌పాషా, మహ్మద్ రియాజ్, సల్మాన్ షరీఫ్, మున్నీబేగం, ఫర్హానాతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సుమారు 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల వాహనం బీదర్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్నట్లు గుర్తించారు. గంజాయి తరలింపు వెనుక వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు.