Road Accident: ఉగాండా రాజధాని కంపాలా ప్రాంతంలో.. బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 63 మంది మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కంపాలా–గులు హైవేపై పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గులు హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ఓ బస్సు, ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు వేగంగా రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై కనీసం ఏడు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 63 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మరణించినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఉగాండా రెడ్‌క్రాస్ సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఊహించలేనిది. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగాయి. కొంతమంది మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో టెక్నికల్ ఎర్రర్! గంటసేపు గాల్లోనే..
మృతదేహాలను పోస్టుమార్టానికి, గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగ్ చేస్తుండమేనని.. వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రజలను కోరారు.