కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. మరి కాబోయే ముఖ్యమంత్రి.. కచ్చితంగా డీకే శివకుమార్ అనే సమాధానమే వినపడుతుంది. కాంగ్రెస్ నేతలైనా, ఇతర పార్టీల నేతలైనా అదే నమ్ముతున్నారు. కానీ సడన్ గా ఓ పేరు బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ పేరు గత కొంతకాలంగా వినపడుతూనే ఉన్నా.. నేరుగా సీఎం సిద్ధరామయ్య కొడుకే ఆయన పేరు ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయనే సతీష్ జార్ఖిహోళి. అసలు ఎవరీ సతీష్. కర్నాటకలో కాంగ్రెస్ ని ఒంటి తేచ్చో అధికారంలోకి తెచ్చాడని అందరి ప్రశంసలు అందుకున్న డీకే శివకుమార్ నే ఢీకొనే సత్తా అయనకు ఉందా? నిజంగానే ఆయన కర్నాటకకు నెక్స్ట్ సీఎం అవుతారా?
సతీష్ జార్ఖిహోళి
అసలు పేరు సతీష్ లక్ష్మణరావు జార్ఖిహోళి. కర్నాటకలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సామాజిక కార్యకర్తగా ఆయనకు గుర్తింపు ఉంది. బెడర నాయక అంటే వాల్మీకి వర్గానికి చెందిన వ్యక్తి. వాల్మీకులు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు, కర్నాటకలో మాత్రం వారికి SC కేటగిరి ఇచ్చారు. కర్నాటకలో SC నాయకుల్లో ఈయనే కీలకం. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన సతీష్.. జనతా దళ్ లో చేరారు. ఆ తర్వాత జనతా దళ్(సెక్యులర్) – JDS లోకి వచ్చారు. 2006లో కాంగ్రెస్‌లో చేరి అంచెలంచలుగా ఎదిగారు. ఎమ్మెల్సీగా చట్ట సభలో అడుగు పెట్టిన ఆయన, 2008 లో ఎమకన్ మార్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్నుంచి వరుసగా ఆయన 4 సార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు అటవీ, పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రజా పనుల శాఖ మంత్రిగా కర్నాటక కేబినెట్ లో కొనసాగుతున్నారు. హిందూత్వ వాదానికి ఆయన పూర్తి వ్యతిరేకం. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపేవారు. సామాజిక సంస్థళ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు.
డీకేకి వ్యతిరేకం..
గతంలో ఓసారి సీఎం రేసులో డీకే శివకుమార్ పేరు బలంగా వినిపించినప్పుడు కూడా సతీష్ జార్ఖిహోళి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయనకు సిద్ధరామయ్య వర్గంలో పరపతి పెరిగింది. సీఎం కావాలని అందరికీ ఉంటుందని, అన్ని సామాజిక వర్గాలు తమ వారే సీఎం కావాలని కోరుకుంటారని కూడా చెప్పారు సతీష్. అప్పట్లో ఆయన్ను శాంతింపజేసేందుకు డీకే, ఆయన సోదరుడు కూడా ప్రత్యేకంగా సమావేశమై నచ్చజెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సతీష్ పేరు సంచలనంగా మారింది.
Also Read: జగన్ అసెంబ్లీ మొదలు.. టైమ్ టేబుల్ ప్రకటించిన వైసీపీ
సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర తాజాగా సతీష్ పేరుని తెరపైకి తెచ్చారు. తన తండ్రి రిటైర్ అయ్యే స్టేజ్ లో ఉన్నారని, కర్నాటకకు తర్వాతి సీఎంగా సతీష్ సరైన నాయకుడని చెప్పారు. ఆయనకు సీఎం అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయన్నారు. డీకే పేరుని మాత్రం యతీంద్ర ప్రస్తావించకపోవడం విశేషం. ఈ వ్యవహారం డీకే వద్దకు కూాడ వెళ్లింది. ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. కర్నాటకలో సీఎం మార్పు వ్యవహారం మరోసారి రచ్చగా మారే అవకాశం కనపడుతోంది. పార్టీని అధికారంలోకి తెచ్చారనే ఇమేజ్ డీకేకి పుష్కలంగా ఉంది. కానీ అధికారంలోకి వచ్చి టైమ్ గడుస్తున్న కొద్దీ నాయకుల స్వరాలు మారుతున్నాయి. మరి సతీష్ రూపంలో పొంచి ఉన్న పోటీని ఆయన ఎలా నెగ్గుకు రాగలరో చూడాలి.
Also Read: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా?