Jagtial district: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. మటన్ లో కారం కోసం వచ్చిన చిన్న గొడవ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. దసరా నాడు భార్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన భర్త దీపావళి నాడు సూసైడ్ చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన సంతోష్ (26), గంగోత్రి (22) చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లైన ఆరు రోజులకే దసరా పండుగ వచ్చింది. పెళ్లైన తర్వాత మొదటి పండుగ కావడంతో సంతోష్, తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. దసరా పండుగ రోజు(అక్టోబర్ 2) అత్తింటిలో మటన్ కూర వండారు. మటన్ కూరలో కారం ఎక్కువైందని సంతోష్ భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చేసిన ఆమె అదే రోజు అత్తింట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య ఆత్మహత్య తట్టుకోలేకపోయిన సంతోష్ మానసికంగా కుంగిపోయాడు. ఎంతో ఇష్టంగా ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి తనను విడిచి వెళ్లిందన్న బాధతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఆమె ఆత్మహత్య చేసుకున్న 19 రోజులకే సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ లోని తన అక్క వద్దకు వెళ్లిన సంతోష్, దీపావళి నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజుల్లోనే నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Also Read: UP Crime News: కాబోయే భార్యతో హోటల్‌లో డాక్టర్.. అర్థరాత్రి ఏం జరిగిందో తెలీదు, షాకింగ్ ఇచ్చేలా
ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంతోష్, గంగోత్రి జీవితాలు ఇంత అర్ధాంతరంగా ముగుస్తాయని అనుకోలేదని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో నేటి యువత ప్రాణాలు తీసుకుంటుందని గ్రామస్థులు వాపోతున్నారు.