Teacher Harassment: తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థాయి గురువులదేనని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు అనుగుణంగా చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థుల ఎదుగుదల కోసం నిస్వార్ధంగా పని చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే.. తన స్టూడెంట్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. అయితే కొందరు చేసే చర్యలు.. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చగా మారుతున్నాయి. కన్న బిడ్డల లాంటి విద్యార్థినులను ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. పాడేరు మండలం రాయపాలెం ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత కొంతకాలంగా విద్యార్థులతో మద్యం కొనుగోలు చేయిస్తున్న ఆయన.. అది తాగి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మగ విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం, విద్యార్థినులను అసభ్యకరమైన రీతిలో తాకడం, లైంగికంగా వేధించడం వంటివి చేసినట్లు సమాచారం.
తన అకృత్యాల గురించి తల్లిదండ్రులు, ఇతర టీచర్లకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుబ్రహ్మణ్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది. క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఎట్టకేలకు కీచక టీచర్ వ్యవహారం తెలియడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ సమక్షంలో పంచాయతీ సైతం నిర్వహించారు. తమ బిడ్డలను వేధిస్తున్న సుబ్రహ్మణ్యంను వెంటనే విధుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. టీచర్ పై ఫోక్సో కేసు పెట్టి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read: Ambati Rambabu: పోసాని గతే అంబటికి పట్టనుందా? 8 రోజుల్లో 36 కేసులు.. రాష్ట్రమంతా తిప్పే ప్లాన్!
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ ఘటన చేరడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో డీఈఓ రామకృష్ణారావు, ఐసీడీఎస్ ఐడీ ఝాన్సీ బాయి పాఠాశాలను సందర్శించి.. విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుడి వేధింపుల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అటు తల్లిదండ్రుల స్టేట్ మెంట్ ను సైతం పరిగణలోకి తీసుకొని కలెక్టర్ కు రిపోర్ట్ ను సమర్పించారు. ఉపాధ్యాయుడి వేధింపులు నిజమేనని తేలడంతో సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తల్లిదండ్రుల డిమాండ్ మేరకు అతడిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని సూచించినట్లు సమాచారం.
Also Read: MacBook Pro M3: ఆపిల్ ల్యాప్‌టాప్‌పై రూ.50000 డిస్కౌంట్.. షాకింగ్ డీల్ ఎక్కడంటే