రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కీలక నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల వాంగ్మూలం సేకరించిన సిట్.. ఆ సాక్ష్యాలను డిస్కు డ్రైవ్‌లో స్టోర్ చేసి వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్(కీలక ఎవిడెన్స్‌లు భద్రపరిచే సెక్షన్)లో ఉంచింది. అయితే, రెండ్రోజుల కింద అనుకోకుండా ఎఫ్ఎస్ఎల్ భవనంలోని మొదటి అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గదిలోని సాక్ష్యాధారాలు మొత్తం మంటల్లో దగ్ధమయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై నిన్న ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్ మట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 సాక్ష్యాధారాలకు సంబంధించిన మెటీరియల్ మిస్సింగ్ అని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో విచారణ త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎస్ఐబీ మాజీ అధికారులను విచారించిన సిట్.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను సైతం విచారించి వారి స్టేట్మెంట్స్‌ను భద్రపరిచింది. అయితే, అవన్నీ ఎఫ్ఎస్ఎల్ భవనంలోని మొదటి అంతస్తులోనే ఉన్నాయని.. పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆ సాక్ష్యాధారాలు మొత్తం కాలిబూడిదయ్యాయని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీనిప్రకారం ఫోన్ ట్యాపింగ్ కేసు ఇకపై ముందుకు సాగదని.. మరోసారి సాక్షులను, ఎస్ఐబీ అధికారులు మొదటి నుంచి ప్రశ్నిస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే, కాలిపోయిన సాక్ష్యాధారాలు డిస్కు డ్రైవ్స్‌లో నుంచి రిట్రైవ్ చేస్తామని ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. అన్నిప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వాటర్ కొట్టారు. ఆ గది మొత్తం సగం వరకు నీటితో నిండిపోయింది. మంటల్లో కాలిపోయిన పరికరాలు మళ్లీ నీటిలో తడిస్తే అవి పనిచేస్తాయా? అందులోని డేటాను ఎలా రికవరీ చేస్తారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే.. సిట్ విచారణ ఇకపై ముందుకు వెళ్తుందా? లేదా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు ఎఫ్ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదం జరిగేలా చేసిందని.. ఫలితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కారు రేసు ఇక మూలకు పడినట్టే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Hyderabad Crime: చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ.. నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు
ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసు నుంచి బీఆర్ఎస్ నేతలను భయట పడేయడానికి ప్రభుత్వం ఇలాంటి పన్నాగం పన్నిందని కాషాయ నేతలు ఆరోపిస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన సమయంలో రికార్డు చేసిన వాంగ్మూలం సైతం ఎఫ్ఎస్ఎల్‌లోనే ఉందని.. కావాలని వాటిని మాయం చేయడానికి .. ఆ కేసు నుంచి బయటపడేందుకే అగ్నిప్రమాదాన్ని క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు.అసలు ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు ఉన్నాయా? వాటిని మాయం చేశారా? అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాగా, ఎఫ్ఎస్ఎల్ ఘటనపై పొలిటికల్ పార్టీల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తుండటంతో జనాలు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.