Hyderabad Murder: హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. సొంత అక్క అని కూడా చూడకుండా తమ్ముడే ఆమెను కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేసిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.
బాటసింగారానికి చెందిన నీల అనే మహిళ భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. అయితే, ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని తమ్ముడు పప్పు రామ్ ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 28న నీలను దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి సమీపంలోని మజీద్‌పురా చెరువులో పడేశాడు.
హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా పప్పు రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అక్క కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదని, కనిపించడం లేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం బయటపడింది. నిందితుడు చూపిన ఆనవాళ్ల ఆధారంగా మజీద్‌పురా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు, నీల శరీర భాగాలను వెలికితీశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
Also Read: కార్పొరేట్లకేనా రుణమాఫీ? అన్నదాతల మాటేమిటి? కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి