Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చోటుచేసుకున్న నవవధువు ఐశ్వర్య మృతి తీవ్ర కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఐశ్వర్య, తాజాగా తన భర్త రాజుతో కలిసి పుట్టింటికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే విగతజీవిగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐశ్వర్య ఫిట్స్‌తో చనిపోయిందని భర్త కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ, ఆమె మరణం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే ఐశ్వర్య మరణంపై ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు క్షేమంగా ఉన్న చెల్లెలు, భర్తతో కలిసి ఇంటికి వచ్చి వెళ్లిన కొద్ది గంటల్లోనే మరణించిందన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త రాజు నిరంతరం ఐశ్వర్యను వేధింపులకు గురిచేసేవాడని, ఆ టార్చర్ భరించలేకే తన చెల్లెలు ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ఐశ్వర్య చనిపోయిందని సమాచారం ఇవ్వడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 7 గురు స్పాట్ డెడ్
మరోవైపు ఐశ్వర్య తండ్రి లక్ష్మయ్య తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని వాపోతున్నారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం రాజు తన కూతురిని వేధించేవాడని, ఆ క్రమంలోనే ఆమెను హతమార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం డబ్బుపై ఆశతోనే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుని, తన బిడ్డను పొట్టనబెట్టుకున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.