Inter Student Suicide: ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల వెనుక అసలేం జరుగుతోంది? అధ్యాపకుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? లేకుంటే సీనియర్లు ర్యాగింగ్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? కాలేజీ మేనేజ్‌మెంట్ వ్యవహారం అనుమానాలకు తావిస్తోందా? తాజాగా హైదరాబాద్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. అసలేం జరిగింది?
హైదరాబాద్‌లో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య
ఇంటర్ అంటే చాలు విద్యార్థులకు చాలా ఒత్తిడి ఉంటుందని చాలా మంది పేరేంట్స్ తరచూ చెబుతున్నమాట. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థంకాకపోవడంతో విద్యార్థులు ఒత్తిడి లోనవుతారు. ఫలితంగా ఎక్కడ ఫెయిల్ అవుతామోనని భయం వారిని వెంటాడుతోంది. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ తరహా ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ర్యాగింగ్ వ్యవహారం చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఇటీవల కాలంలో ర్యాగింగ్ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులను ఇంటికి పంపించిన ఘటనలు లేకపోలేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి మృతి వెనుక సీనియర్ విద్యార్థులు కారణమనే వాదనలు లేకపోలేదు.
హైదరాబాద్‌లోని కెపీహెచ్‌బీ సాయినగర్ ప్రాంతంలోవున్న ఇగ్నైట్ కాలేజీలో శ్రీకేతన్ ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న ఆ విద్యార్థి అనుకోకుండా మృతి చెందాడు. కాలేజీ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం.
ఘటన వెనుక సీనియర్లు ర్యాగింగ్ కారణమా?
అయితే కొడుకు మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రిలో కొడుకుని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. ఈలోగా విద్యార్థి సంఘాలు అక్కడకు చేరుకున్నాయి. అసలు కాలేజీలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి.
కొడుకు మృతిపై తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు. తమ కొడుకు కాలేజీ జాయిన్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో అంతా బయటపెట్టారు. తొలుత 125 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని యాజమాన్యం చెప్పిందని వివరించారు మృతుడి తండ్రి బలరామ్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ విద్యార్థులను అక్కడికి తరలించింది యాజమాన్యం.
దీంతో కాలేజీలో విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరిగింది. విద్యార్థి మృతికి ముందు అంటే ఆదివారం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఆ విద్యార్థి. తనను సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పాడు. మా కొడుకు మృతి వెనుక సీనియర్ విద్యార్థుల ప్రమేయముందని కుండబద్దలు కొట్టేశారు.
ALSO READ: ఓటేయడానికి వెళ్తూ కానరాని లోకాలకు, రోడ్డు ప్రమాదంలో దంపతులు
తన కొడుకు ఉరేసుకునే పిరికివాడు కాదని, ఆ ధైర్యం లేదన్నారు. ఈ విషయంలో సెకండ్ ఇయర్ విద్యార్థులపై అనుమానం ఉందన్నారు కన్నతండ్రి. బుధవారం ఉదయం నాలుగున్నర గంటలకు రూమ్‌కి వెళ్లిన విద్యార్థి, ఎనిమిదిన్నర వరకు బయటకు రాలేదంటే ఏం జరిగిందో యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు.
ఘటనపై కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పోలీసులు యాజమాన్యానికి సహకరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు.