Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చి వేగంగా దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో .. చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పరిధిలోని నేషనల్ హైవే–44పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భిక్కనూర్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ స్కూటీపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా రాంగ్ రూట్‌లో వస్తున్న టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదం వల్ల నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు గంట పాటు వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను డైవర్ట్ చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కాగా పోలీసులు టిప్పర్ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: బైక్ పార్కింగ్ గొడవ.. 30 మందితో హాస్టల్ యువకులు ఇంట్లోకి చొరబడి..
ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత అంశాన్ని గుర్తుచేసింది. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం, వేగంగా నడిపే లారీల వల్ల ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నా, అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.