Ghaziabad Crime: హత్యలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఎగ్జాంపుల్. 11 ఏళ్ల కూతురి ముందు భార్యని గన్‌తో కాల్చి చంపాడు ఆమె భర్త. ఈ ఘటనతో ఆ బాలిక హడలిపోయింది. ఈ ఘటన వెనుక ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
యూపీలో దారుణం..
యూపీలోని ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ఊహంచని ఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఓ వ్యక్తి తన 11 ఏళ్ల కుమార్తె ముందే భార్యను కాల్చి చంపాడు. ఫ్యామిలీ సమస్యల వల్ల ఈ దంపతులు రెండు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. దంపతుల మధ్య గొడవ జరిగిన తర్వాత హత్య జరిగిందని పోలీసులు చెప్పారు.
వికాస్ సెహ్రావత్-రూబీ వివాహం జరిగి చాన్నాళ్లు అయ్యింది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకరికి 15 ఏళ్లు, మరొకరు 11 ఏళ్లు. రూబీ సొంతూరు మోడీనగర్‌లోని టిబ్రా గ్రామానికి చెందినది. ఒకప్పుడు కాంట్రాక్టర్‌గా వ్యవహరించేవాడు వికాస్. ఆ తర్వాత అనుకోని సమస్యల కారణంగా ఇబ్బందులు మొదలయ్యాయి. మద్యపానానికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత గ్యాంగ్‌లు, గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
కూతురి మందు భార్యని కాల్చి చంపాడు
ఈ సమస్యల నేపథ్యంలో భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రెండు నెలల కిందట బయటకు వెళ్లాడు వికాస్. మంగళవారం ఉదయం వికాస్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు కోసం ఫ్లాట్‌కు వచ్చాడు. అయితే వాటిని ఇవ్వడానికి భార్య రూబీ నిరాకరించింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా తారాస్థాయికి చేరింది. పట్టరాని కోపంతో తనతో తెచ్చుకున్న గన్‌తో భార్యని కాల్చిచంపాడు వికాస్. అప్పటికి పెద్ద కూతురు స్కూల్‌కి వెళ్లింది.
ఘటన సమయంలో ఇంట్లో 11 ఏళ్ల కూతురు మాత్రమే ఉంది. ఆ షాక్ నుంచి బాలిక ఇంకా కోలుకోలేదని చెబుతున్నారు. కాల్పుల తర్వాత వికాస్ తన మోటార్ సైకిల్‌పై అపార్ట్‌మెంట్ నుండి పారిపోయాడు. భార్య రూబీ నేలపై రక్తపు మడుగులో పడి ఉంది. తుపాకీ శబ్దం విన్న పొరుగువారు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అపార్ట్ మెంట్ యజమానుల సంఘం సభ్యుల నుండి సమాచారం వెళ్లింది.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి
వెంటనే పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. రూబీని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తర్వాత వారి బంధువులకు అప్పగించారు. వికాస్ ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. 2020లో మోడీనగర్ పోలీస్ స్టేషన్‌లో దంపతులపై హత్య కేసు నమోదు అయ్యింది. ఆ ఏడాది గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద అభియోగాలు మోపారు.
14 మందిలో వికాస్ కూడా ఒకడు. రూబీకి 2021లో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో వికాస్‌కు బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య వివాదాలు తీవ్రమయ్యాయి. అయితే అప్పుడప్పుడు వికాస్ ఇంటికి వచ్చివెళ్లేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేస్తున్నారు. పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు.