Uttarakhand News: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంతు చిక్కని వ్యాధి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత పది హేను రోజుల నుంచి రాష్ట్రంలోని రెండు జిల్లాల ప్రజలు ఈ వ్యాధితో నానా అవస్థలు పడుతున్నారు. ఆల్మోరా, హరిద్వార్ జిల్లాల్లో ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లోని ఈ రెండు జిల్లాల్లో మరణాలు నమోదవ్వడం స్థానికులలో తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఈ వ్యాధి సోకి ఇప్పటికే పది మంది వరకు మృతిచెందారు. ఆల్మోరా జిల్లా ధౌలాదేవి మండలంలో అత్యధికంగా ఏడుగురు మృతిచెందారు. హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
⦿ భయాందోళనలో గ్రామస్థులు..
మరణించిన వారిలో చాలా మందిలో ప్రధానంగా వైరల్ ఫీవర్, ప్లేట్ లెట్స్ సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా డెంగ్యూ, తీవ్రమైన వైరల్ ఫీవర్ వ్యాధుల్లో కనిపిస్తాయి. దీంతో.. స్థానిక గ్రామస్థులు ఇది డెంగ్యూ వ్యాప్తి అయి ఉండవచ్చని భయాందోళనకు గురవుతున్నారు. ఈ మరణాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. వైద్యాధికారులు మాత్రం తొందరపడవద్దని స్పష్టం చేస్తున్నారు.
⦿ 100కి పైగా కేసులు నమోదు..
ఆల్మోరా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నవీన్ చంద్ర తీవారీ మాట్లాడుతూ.. మృతుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ఆల్మోరా మెడికల్ కాలేజీకి పంపించామని అన్నారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వార మరణాలకు గల అసలు కారణాలు ఏంటో తెలుస్తోందని వివరించారు. ఆయన ఏడుగురి మృతిచెందడం పై స్పందించారు. ఇందులో ముగ్గురు వైరల్ ఇన్ఫెక్షన్ తో చనిపోయి ఉండొచ్చని.. మిగిలిన వారు వయస్సుతో వచ్చిన అనారోగ్యం వల్ల సంభవించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వందకు పైగా కేసులు నమోదు అయ్యాయని అన్నారు.
⦿ స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ..
మరోవైపు.. ధౌలాదేవి ప్రాంతంలోని స్థానికులు అధికారుల దర్యాప్తు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఏడుగురు మృతి చెందినా.. ఒక్ పోస్టుమార్టం కూడా నిర్వహించకపోవడంపై వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే పోస్ట్‌మార్టం తప్పనిసరని వారు ఫైరవుతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో.. రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది.
ALSO READ: RITES Recruitment: డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. మంచి వేతనం, ఉద్యోగ ఎంపిక విధానమిదే..
⦿ ఇది సీిజన్ వైరల్ ఫీవర్..?
రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఆర్. రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాధులు నెలకొన్న ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు. మరణాలపై అసలు కారణాలు ఏంటో వీలైనంత త్వరలోనే తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు ఈ వ్యాధిపై నెలకొన్న వదంతులను తీవ్రంగా ఖండించారు. ఇది డెంగ్యూ ఫీవర్ కాదని.. సీజనల్ వైరల్ ఫీవర్ అని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణం చల్లబడే కొద్ది కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని వారు తెలిపారు.
ALSO READ: Ranji Trophy 2025: ప్రమాదంలో పృథ్వీ షా జట్టు…5 పరుగులకే 4 వికెట్లు..నలుగురు బ్యాటర్లు డకౌట్!
మొత్తం మీద.. ఉత్తరాఖండ్‌లో పది మంది మరణాలకు కారణమైన ఈ అంతుచిక్కని జ్వరం స్థానికులలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ దీన్ని సాధారణ సీజనల్ వైరల్ ఫీవర్ గా తెలిపింది. అయితే.. అది వైరల్ ఇన్ఫెక్షనా లేదా మరేదైనా తెలియాలంటే, ల్యాబ్ రిపోర్టులు, పూర్తిస్థాయి వైద్య నివేదికలు రావాల్సి ఉంది.