Anantapur Crime: పాపం పండితేచాలు.. అడ్డంగా బుక్కవుతారు కొందరు. ఆ నిందితుడు విషయంలోనూ అదే జరిగింది. దశాబ్దమున్నరపాటు పోలీసులను ముప్పుతిప్పులు పెట్టాడు. దాదాపు 10 మందికిపైగా పోలీసులు సస్పెన్షన్‌కు గురైన సందర్భాలు ఉన్నాయి. చివరకు ఎలా చిక్కాడు? ఎవరా వ్యక్తి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
వాడొక గజదొంగ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురానికి చెందిన 33 ఏళ్ల నాగిరెడ్డి. చదువు కరుణించలేదు.. చివరకు 18వ ఏటా నుంచి చోరీల బాటపట్టాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దాన్ని వృత్తిగా స్వీకరించాడు. ఆ తర్వాత అంతరాష్ట్ర దొంగగా మారిపోయాడు. పలు రాష్ట్రాల పోలీసులకు కీలక నిందితుడిగా మారిపోయాడు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను దొంగతనాలకు వేదికగా చేసుకున్నాడు నాగిరెడ్డి. సింపుల్ గా చెప్పాలంటే అంతరాష్ట్ర దొంగగా మారిపోయాడు. అతనిపై వివిధ పోలీసుస్టేషన్లలో 45 కేసులు నమోదు అయ్యాయి. అతగాడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. రెండేళ్ల కిందట కడప జిల్లా కొండాపురంలో పోలీసులకు చిక్కాడు. కాకపోతే అనూహ్యంగా వారి నుంచి తప్పించుకున్నాడు.
పోలీసుల్ని సస్పెండ్ చేయించాడు
ఈ ఘటనలో 11 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. లేటెస్టుగా అనంతపురం జిల్లా విడపనకల్లు శివారులోని అక్టోబరు నాలుగున రోడ్డు ప్రమాదంలో నిందితుడు నాగిరెడ్డి గాయపడ్డాడు. తన కారును నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో విశాఖకు చెందిన రామ్‌సుధీర్-లావణ్య దంపతులు స్పాట్‌లో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
ALSO READ: హైదరాబాద్ లో దారుణం.. ప్రేమ పేరుతో యువతిని గర్బవతి చేసిన ఓ పోలీసు
ఘటనా స్థలాన్ని గుంతకల్లు పోలీసులు పరిశీలించినప్పుడు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాగిరెడ్డి కారులో 3 లక్షల నగదు, ఆభరణాలు కనిపించాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు నాగిరెడ్డి నేరచరిత్ర బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈలోగా అలర్టయిన పోలీసులు ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితుడు కోలుకోవడంతో మంగళవారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో నిందితుడ్ని హాజరు పరిచారు. న్యాయమూర్తి రిమాండు విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు పోలీసులు. గతంలో మాదిరిగా అవకాశం ఇవ్వకుండా ఈసారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి జైలుకి తరలించారు.