karnataka Incident: మైసూరు: ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారికి లోకమేమిటో తెలియదు. కంటికి కనిపించిన ప్రతి వస్తువును అమాయకంగా నోటి దగ్గరకు తీసుకెళ్లే ఆ పసిప్రాయమే చివరకు శాపమైంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ తాలుకా దొడ్డ హెజ్జూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడైన ఆరున్నర నెలల చిన్మయ్ గౌడ, ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక మందార పువ్వును మింగడంతో శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్మయ్ కంటికి అక్కడ ఉన్న మందార పువ్వు కనిపించింది. దానిని ఆహార పదార్థంగా భావించిన చిన్నారి, పువ్వు కింది భాగంలో ఉండే కాండాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి అందక పసికందు విలవిలలాడిపోయాడు. గమనించిన చిన్నారి సోదరి వెంటనే ఆ పువ్వును తీయడానికి ప్రయత్నించినప్పటికీ అది మరింత లోపలికి వెళ్లి పరిస్థితి విషమించింది. కళ్లముందే చిన్నారి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూసి తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మైసూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతున్నాడు. మైసూరు ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్మయ్ తుది శ్వాస విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి ఇలా అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటనపై హున్సూర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లలు ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. చిన్నపిల్లలు దేనినైనా నోట్లో పెట్టుకునే అలవాటు కలిగి ఉంటారు కాబట్టి, గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న చిన్న చిన్న వస్తువులు, పండ్లు, పువ్వులను వారికి అందకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క క్షణం అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.
Also Read: మౌనిక మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. గొంతు పిసికి, ముక్కలు ముక్కలుగా.. ఎలా చంపాడంటే?