Vande Bharat Accident: ఇటీవల కాలంలో రీల్స్ పేరుతో కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. అయితే ఈ స్టంట్స్ ఒక్కోసారి ప్రాణాలు తీస్తున్నాయి.
బీహార్‌లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో ఐదుగురు టీనేజర్లు రైలు ట్రాక్ పై రీల్స్ షూట్ చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం బీహార్‌లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైయ్యాడు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
“శుక్రవారం ఉదయం 4.54 గంటలకు పూర్ణియా, కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని నలుగురు టీనేజర్లు మృతి చెందారని మాకు సమాచారం అందింది. ఈ సంఘటన జరిగినప్పుడు వారు ట్రాక్‌పై రీల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది” అని నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.
జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గత నెల సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది అరారియా, పూర్ణియా, మాధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, వైశాలి, పాట్నా జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది.
Also Read: Hyderabad Crime News: పెదనాన్న పరువు తీస్తున్నాడని యువతి సూసైడ్, హైదరాబాద్‌లో దారుణం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ మాట్లాడుతూ.. “ఇది పరిపాలన నిర్లక్ష్యం. బీహార్‌లోని అనేక చోట్ల రైల్వే అండర్‌పాస్, ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదు. మరణించిన వారు మా ప్రాంతానికి చెందినవారు. వారు దళిత కుటుంబానికి చెందిన యువకులు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ సంఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.