Cough Syrup: రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ చింద్వారాలో దగ్గు మందు తాగిన చిన్నారుల్లో మూత్రపిండాల సంబంధిత సమస్యలు తలెత్తి తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనల నేపథ్యంలో కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ సిరప్ ల తయారీకి వాడిన డెక్స్ట్రోమెథోర్ఫాన్ పిల్లలకు సిఫార్సు చేయకూడదని నిర్ణయించింది. పిల్లలకు వాడే దగ్గు సిరప్ లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
పిల్లల దగ్గు సిరప్‌ల హేతుబద్ధమైన వాడకంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనలు చేసింది.
“దగ్గు, జలుబు సిరప్ లను 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సిఫార్సు చేయకూడదు లేదా పంపిణీ చేయకూడదు. ఇవి సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి సిఫార్సు చేయకూడదు. అత్యవసరంగా ఉపయోగించాల్సి వస్తే వైద్యుల పర్యవేక్షణలో తగిన మోతాదుకు పరిమితం చేయాలి. అతి తక్కువ సమయంలో, వివిధ సిరప్ లను వినియోగించడం నివారించాలి. వైద్యులు సూచించిన వాటినే ఉపయోగించాలి” అని మార్గదర్శకాలు జారీ చేసింది.
దగ్గు సిరప్ నమూనాల్లో తీవ్రమైన కిడ్నీల సమస్యలకు కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) లేదా ఇథిలిన్ గ్లైకాల్ (EG) లేవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. రాజస్థాన్‌లో ఇద్దరు చిన్నారుల మరణాలకు సంబంధించి, నమూనాలలో ప్రొపైలిన్ గ్లైకాల్ కలుషితాలు లేవని నిర్ధారించింది.
మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు వినియోగంతో పిల్లల మరణాల ముడిపడి ఉన్నాయని నివేదికలు అందడంతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) బృందాలు ఈ ప్రాంతాల్లో విచారణ చేపట్టాయి.
వివిధ దగ్గు సిరప్‌ల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈ నమూనాల్లో తీవ్రమైన కిడ్నీల సమస్యలకు కారణమయ్యే కలుషితాలు లేవని గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు నమూనాలను పరీక్షించింది. ఇందులోనూ DEG/EG లేకపోవడాన్ని నిర్ధారించింది. పూణే ఎన్ఐవీ సిరప్ వినియోగదారుల రక్తం, ఇతర నమూనాలను పరీక్షించింది.
శ్వాసకోశ నమూనాల ఇతర సంస్థలకు పంపి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం, ఆయా రాష్ట్రాల సంస్థలు దగ్గు మందు మరణాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ సిరప్‌ను జైపూర్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ సిరప్ నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు ఫెయిల్ అయ్యాయని అధికారులు గుర్తించి వాటిపై నిషేధం విధించారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ 660 బాటిళ్లను తయారు చేయగా 594 బాటిళ్లను వివిధ షాపుల్లో సరఫరా చేశారు. కంపెనీలో ఉన్న 66 బాటిళ్ల నమూనాలను అధికారులు పరీక్షిస్తున్నారు.
Also Read: Tomato virus: పిల్లల్లో టమాటా వైరస్.. ఇది ఎలా వ్యాప్తి చెందుతోంది? లక్షణాలేమిటీ?
ఈ దగ్గు సిరప్ లను అమ్మకూడదని మందుల షాపులకు సూచించారు. కిడ్నీ సమస్యలున్న పిల్లలు ఈ సిరప్ తాగడం వల్ల వారిపై మరింత ప్రభావం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సిరప్ సురక్షితమని నిరూపించడానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు దీనిని వాడగా.. అతడు అనారోగ్యానికి గురయినట్లు అధికారులు తెలిపారు. దగ్గు సిరప్ మరణాలకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కేంద్రం దర్యాప్తు చేస్తుంది.