ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు పెద్దలు. వైద్య నిపుణులు కూడా ఈ మాటతో ఏకిభవిస్తున్నారు. కొత్తగా నిర్ధారణ అయిన టైప్ 2 డయాబెటిస్ రోగులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. అలాంటి వారికి మెట్ ఫార్మిన్ ఔషధం కంటే పచ్చి ఉల్లిపాయ మంచిదా? అనే ఆలోచన కలుగుతోంది. దీనికి సంబంధించి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కల్రా కీలక విషయాలు వెల్లడించారు. అతడి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే రోగులలో చాలామంది “టైప్ 2 డయాబెటిస్‌లో పచ్చి ఉల్లిపాయలు మెట్‌ఫార్మిన్‌ను భర్తీ చేయగలవా?” అని అడుగుతున్నట్లు వెల్లడించారు. దీనికి ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వాస్తవానికి ఉల్లి టైప్-2 డయాబెటిస్ ను పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం లేదంటున్నారు. అదే సమయంలో మెట్ ఫార్మిన్ కు ప్రత్యామ్నాయం కూడా కాదంటున్నారు. కానీ, సమస్యను తగ్గించడంలో కొంతమేర సాయపడుతుందంటున్నారు. టైప్ 2 డయాబెటిస్ కు మెట్ ఫార్మిన్ ఫస్ట్ లైన్ చికిత్సగా కొనసాగుతుందన్నారు. ఇది HbA1cని స్థిరంగా తగ్గిస్తుందన్నారు. “ఉపవాసం, భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో నిరూపించబడింది. కాలేయ గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం, పేగు గ్లూకోజ్ శోషణను తగ్గించడం చేస్తుంది” అని డాక్టర్ కల్రా అన్నారు.
అటు డాక్టర్ కల్రా కీలక విషయాలు చెప్పారు. ఉల్లిపాయలు పచ్చిగా తినేటప్పుడు హైపోగ్లైసీమిక్ లక్షణాలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. “ఉదాహరణకు, 100 గ్రాముల పచ్చి ఎర్ర ఉల్లిపాయను తినడం వల్ల టైప్-2 డయాబెటిక్ రోగులలో కొన్ని గంటల్లోనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ విషయం క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. ఉల్లిపాయ సమ్మేళనాలు A-అమైలేస్, A-గ్లూకోసిడేస్ aegzr ఎంజైమ్ లను నిరోధించగలవని వెల్లడైంది. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. భోజనం తర్వాత గ్లూకోజ్ స్పైక్ లను తగ్గిస్తాయి అని కూడా అధ్యయనాలు వెల్లడించాయి” అని డాక్టర్ కల్రా అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది రోగులలో ఉల్లిగడ్డలు తీసుకుంటే డయాబెటిస్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే అంశంపై అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. “ఉల్లిపాయల ప్రభావాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, స్వల్పకాలికంగా, చిన్న సమూహాలలో అధ్యయనం చేయబడ్డాయి. ప్రయోజనాలను చూడటానికి, ప్రతిరోజూ పెద్ద మొత్తంలో తినవలసి ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా మందికి ఆచరణాత్మకం కాదు” అని కల్రా చెప్పుకొచ్చారు. సో, జీవక్రియ ఆరోగ్యం కోసం రోగులు ఉల్లిపాయలు, ఇతర కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ కల్రా ప్రోత్సహిస్తున్నప్పటికీ.. వాటిని మెట్ ఫార్మిన్ లాంటి మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేమన్నారు. మందులకు అనుబంధంగా ఉపయోగించడం ఉత్తమమన్నారు.
Read Also: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!