మామూలు కథలు కాదు, అతి సుందరమైన కట్టు కథలు అవి అంటూ పాకిస్తాన్ పై సెటైర్లు పేల్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్. భారత్ కి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ పాకిస్తాన్ అధికారులు చెబుతున్న మాటలపై ఆయన ఘాటుగా స్పందించారు. అవి “మనోహర్ కహానియా” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఆరోజు ఏం జరిగిందంటే?
ఆపరేషన్ సిందూర్ విజయంలో భారత ఎయిర్ ఫోర్స్ ఘనత ఎంతో ఉంది. పాకిస్తాన్ విమానాలను గగన తలంలోనే పేల్చివేసింది. పాకిస్తాన్ లోని ముష్కర స్థావరాలను కూడా మట్టుబెట్టింది. ఆధునిక పైటర్ జెట్లుగా పాకిస్తాన్ చెప్పుకునే F-16, J-17 విమానాలను భారత్ కూల్చివేసింది. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని వార్తలు వినిపించాయి. భారత్ కి చెందిన యుద్ధ విమానాలను కూల్చి వేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కానీ కనీసం వాటి ఆనవాళ్లు కూడా వారు చూపించలేకపోయారు. ఇటు భారత్ మాత్రం తాము కూల్చివేసిన పాక్ విమానాల శకలాలను ప్రపంచ దేశాల ముందుకు తెచ్చింది. తమ సైనిక సామర్థ్యం ఇదీ అని చాటి చెప్పింది.
ఇప్పుడెందుకీ ప్రస్తావన..?
93వ వైమానిక దళ దినోత్సవాల సందర్భంగా మరోసారి ఈ ప్రశ్నకు జవాబిచ్చారు భారత వైమానిక దళాధిపతి అమర్ ప్రీత్ సింగ్. నాలుగురోజులపాటు జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ శిబిరాలపై భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ కి అమెరికానుంచి సరఫరా అయిన F-16 విమానాలు, చైనా సరఫరా చేసిన J-17 విమానాలను భారత యుద్ధ విమానాలు వెంటాడి నాశనం చేశాయి. కనీసం 5 హైటెక్ యుద్ధ విమానాలను నాశనం చేశామని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ దాడుల కారణంగా కనీసం నాలుగు చోట్ల రాడార్లు దెబ్బతిన్నాయని, రెండు చోట్ల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, మరో రెండు చోట్ల రన్‌వేలు దెబ్బతిన్నాయని చెప్పారు.
పాకిస్తానే ఏమంటోంది?
ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిన తర్వాత పాకిస్తాన్ మాటల యుద్ధంతో రెచ్చిపోయింది. భారత్ కి తీరని నష్టం కలిగించామంది. భారత్ వాయుసేనకు చెందిన 15 జెట్ విమానాలను కూల్చి వేశామని ప్రగల్భాలు పలికింది. తాజాగా భారత వాయుసేన అధిపతి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారు. అవన్నీ కట్టుకథలని తేల్చేశారు. అదే నిజమైతే దానికి రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కి జరిగిన నష్టాన్ని తాము అందరికీ చూపించగలిగామని, అయితే భారత్ కి జరిగిందని వారు చెబుతున్న నష్టం ఎవరికైనా కనపడిందా అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ కేవలం కట్టుకథలతోనే కాలక్షేపం చేస్తోందన్నారు. ఒకవేళ నిజంగానే వారు 15 విమానాలను కూల్చి ఉంటే.. ఒక్క ఫొటో అయినా బయటకు వచ్చేది కదా అని ప్రశ్నించారు.
Also Read: 2 గంటలు ఇంటర్నెట్ బంద్, రోడ్లపైకి పోలీసు బలగాలు..
ఎందుకీ డ్రామాలు?
పాకిస్తాన్ అబద్ధాల పుట్ట. ఆ దేశ నాయకులు కానీ, సైనికాధికారులు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పరు. పైగా భారత్ తో యుద్ధం అంటే కిందపడినా తమది పైచేయి అని చెప్పుకుంటారు. యుద్ధం వద్దంటూ కాళ్లబేరానికి వచ్చి, ప్రపంచ దేశాల ముందు మాత్రం తల ఎగరేస్తున్నారు. అమెరికా చొరవతో యుద్ధం ఆగిందని ప్రచారం మొదలు పెట్టారు. భారత్ చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన పాక్ సైన్యం, యుద్ధం ఆగిన తర్వాత మాత్రం మాటలతో రెచ్చిపోయింది.
Read Also: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ చిచ్చు.. టెస్ట్ చేసిన డాక్టర్‌కి ఏమైంది?