Serial killer: కేరళలో అలప్పుళ్ళ జిల్లాలోని చెర్తల సమీపంలోని పల్లిపురంలో ఒక ఇంటి గదుల్లో ఇప్పుడు ఎముకల వాసన, మాయమైన వ్యక్తుల ఆర్తనాదాలు మాత్రమే మిగిలిపోయాయి. బయట నుంచి చూస్తే ఓ సాధారణ పల్లెటూరి ఇంటిలా కనిపించే ఆ నివాసం ఇప్పుడు ఒక భయంకరమైన మానవ మృగం చేసిన నేరాలకు వేదికగా మారింది. ఆ మానవ మృగం ఎవరో కాదు 68 ఏళ్ల సెబాస్టియన్ అనే వృద్ధుడు. ఇప్పటికే జెయినమ్మ అనే మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడి ఇంటి ఆవరణను తవ్వితే.. బయటపడింది ఎముకల భూతం.
జెయినమ్మ మిస్సింగ్ కేసు.. కానీ ఇది మొదటిదే కాదు!
ఈ కథకు తెరతీయడంతో మొదలైంది ఎక్కడో కాదు.. జెయినమ్మ అనే మహిళపై ఫైల్ అయిన మిస్సింగ్ కేసు నుండే. ఆమె భర్త అప్పచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసుల దృష్టి సెబాస్టియన్ వైపు మళ్లింది. దర్యాప్తులో అతడిపై అనుమానాలు బలపడుతూ ఉండగా, పోలీసులు అతడి ఇంటి ఆవరణలో శోధన చేపట్టారు. అక్కడ కనిపించింది.. దహనమైన ఎముకల ముక్కలు, రక్తపు మచ్చలు, స్త్రీల దుస్తులు, బ్యాగులు, ఇంకా గంభీరమైన నిశ్శబ్దం!
దహనమైన మానవ ఎముకలు.. దృష్టికి మించిన దారుణం
అతడి ఇంట్లో ఉన్న బావి పక్కన, వెనుక వైపు నిల్వ గదుల్లో మొత్తం 20కి పైగా దహనమైన మానవ ఎముకల ముక్కలు, పళ్ల తుక్కలు లభ్యమయ్యాయి. అలాగే ఓ మహిళ హ్యాండ్బ్యాగ్, బ్లౌజులు, చీరలు వంటి వస్తువులు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇవన్నీ ప్రస్తుతం ఫోరెన్సిక్ DNA పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించబడ్డాయి. ఒక్క జెయినమ్మ కాదు.. ఇంకెవరో చాలా మంది సెబాస్టియన్ మాయలో పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
కేవలం ఒక్కరు కాదు..
ఈ కేసు మరింత సంచలనంగా మారేందుకు ప్రధాన కారణం.. బిందు పద్మనాభన్ (2006), ఐషా (2012) అనే ఇద్దరు మహిళల గల్లంతు కేసులు. రెండింటిలోనూ అప్పట్లో స్పష్టత రాలేదు కానీ, ఇప్పుడు అవన్నీ సెబాస్టియన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఇద్దరూ సామాజికంగా ఒంటరిగా జీవించేవారని పోలీసులు వెల్లడించారు. ఇది అతడికి వరంగా మారింది. ఒంటరిగా ఉండే, అశ్రయంలేని మహిళలే అతడి లక్ష్యమన్న తీరులో ఈ వృద్ధుడు ప్రబుద్ధుడిలా మారి హత్యలకు పాల్పడేవాడని పోలీసులు తెలుపుతున్నారు.
బిందు కోసం ఏడేళ్లు పోరాడిన యాక్షన్ కౌన్సిల్
బిందు కేసులో 2017 నుంచి న్యాయం కోసం పోరాడుతున్న యాక్షన్ కౌన్సిల్ ఈ తాజా పరిణామాల నేపథ్యంలో గట్టిగా స్పందించింది. మూడు కేసులనూ సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సెబాస్టియన్‌కి సహకరించిన వారు ఉన్నారా అన్న అనుమానాలకూ వారు గళమెత్తుతున్నారు.
Also Read: AP Culture District: ఏపీలో కొత్త జిల్లా.. ఇక్కడన్నీ స్పెషల్.. ఒక్కసారి వెళ్లారంటే మళ్లీ రాలేరు!
మానవ మృగమా? మానసిక ఉన్మాదమా?
ఈ కేసు శరవేగంగా దర్యాప్తు సాగడం, తవ్వితే బయటపడుతున్న దారుణాలు చూసిన పోలీసులు, స్థానికులు ఒక్కటే అంటున్నారు.. ఇది సాదారణ హత్య కాదు. ఇది పరిచయంతోనే దగ్గరయ్యే, క్రమంగా మాయం చేసే సీరియల్ కిల్లర్ ప్రవర్తనగా భావిస్తున్నారు. ఇలా విస్తృతంగా, సంవత్సరాల వ్యత్యాసంలో మహిళలు మాయమవ్వడమే దీనికి గట్టి సూచన. సెబాస్టియన్ నిజంగా ఉన్మాది కిల్లరా? లేక ఇతడికి సపరేట్ నెట్‌వర్క్ ఉందా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఈ ఘటన కేవలం చర్చలకే పరిమితం కాకుండా, కేరళ క్రైమ్ బ్రాంచ్ వెంటనే రంగంలోకి దిగింది. అలప్పుళ్ల, కొట్టాయం పోలీస్ యూనిట్లు కలసి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. వీలైనంత తొందరగా DNA పరీక్షలు, పాత కేసుల ఫైలింగ్ తిరిగి తెరిచి ఆధారాలు శోధిస్తున్నారు.
ఓ ఇంట్లోనుంచి ప్రారంభమైన దర్యాప్తు.. ఎన్ని రహస్యాల దాకా వెళ్లబోతుందో?
సెబాస్టియన్ ఇంటి పరిసరాల్లో ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎముకల అవశేషాలు బయటపడే అవకాశం ఉందని పోలీసుల అనుమానం. అతడు నివసించిన ప్రాంతం, గతంలో కలిసి పని చేసినవారు, పక్క గ్రామాల్లో మిస్సింగ్ కేసులన్నీ ఒకేసారి రీఓపెన్ అవుతున్నాయి.
ఈ కేసు కేవలం ఒక నేర కథ కాదు.. ఇది ఒక సమాజం ఎలా ఓ మానవ మృగాన్ని గుర్తించలేకపోయిందో చెప్పే శోకగాథ. సామాజికంగా ఒంటరిగా జీవిస్తున్నవారు ఎంతో సులభంగా లక్ష్యంగా మారుతున్నారన్నది దీనిలోని కఠినమైన వాస్తవం. ఇది కేరళ రాష్ట్రానికే కాక దేశానికి హెచ్చరికగా మారుతుంది. నేరాలను చేసేందుకు వయస్సు పరిమితం కాదని 68 ఏళ్ల ఈ ప్రబుద్ధుడి నేరాల నిర్వాకాన్ని చూస్తే తెలిసిపోతుంది. మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఇలాంటి వారు ఉంటారు జాగ్రత్త!