Mulugu Road Accident: ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్లిన లారీ ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదనలతో మిన్నంటాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే.. మేడారం సమ్మక్క సారమ్మల దర్శనానికి వచ్చిన.. ఒకే గ్రామానికి చెందిన వారిపై ఇసుక లారీ మృత్యుశకటం రూపంలో దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. కుటుంబ సభ్యులతో కలిసి 25మంది ట్రాక్టర్‌లో మేడారం వనదేవతల దర్శనానికి వచ్చారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు.
తాడ్వాయి జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ తాగడానికి ఓ దుకాణం వద్ద ఆగారు. ఏటూరునాగారం వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ 10మీటర్లు ఎగిరిపడడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఉప్ప దుర్గ, చేతుపల్లి సీత ఉన్నారు. అలాగే చేతుపల్లి సిద్ధు, చేతుపల్లి ముత్తమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడ్వాయి ములుగు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: అదుపుతప్పి బావిలో పడిన కారు.. స్పాట్ లోనే ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే జైపూర్ లో ఆదివారం రాత్రి మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.