మహబూబాబాద్ మండలం బలరాం తండాలో శనివారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను తండ్రి మదన్ (40), కుమారుడు లక్షిత్ (6)గా పోలీసులు గుర్తించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలం వద్ద ఉన్న బావి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి లక్షిత్ ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న విద్యుత్ తీగలను తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురై అదుపుతప్పి బావిలో పడిపోయాడు. గమనించిన తండ్రి మదన్, తన కుమారుడిని కాపాడాలనే ఆరాటంతో వెంటనే బావిలోకి దూకాడు. అయితే బావి వద్ద విద్యుత్ సరఫరా అవుతుండటంతో తండ్రి కూడా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.
దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి కూడా ప్రాణాలు వదలడం స్థానికులను కన్నీరు పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.