Smartglasses UPI| ఈ రోజుల్లో అందరూ ఫోన్ పే, గూగుల్ పే లాంటి యుపిఐ సేవల ఉపయోగిస్తున్నారు. దీని కోసం జేబులో ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. నగదు రహిత చెల్లింపుల కోసం ఇది మంచి ప్రత్యామ్నాయమే అయినా.. ఫోన్ క్యారీ చేయాల్సిన పరిస్థితి. పైగా పిన్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ప్రత్యామ్నాయం వచ్చేసింది. కేవలం కంటిచూపుతో యుపిఐ చెల్లింపులు చేయవచ్చు.
భారతదేశంలో యుపిఐ చెల్లింపులు అనుమతించే నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్ ద్వారా UPI లైట్ పేమెంట్లను ప్రవేశపెట్టింది. వినియోగదారులు కేవలం QR కోడ్ స్కాన్ చేసి వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
చిన్న మొత్తంలో లావాదేవీలకు మొబైల్ ఫోన్ లేదా పేమెంట్ ధృవీకరణ PIN అవసరం లేదని NPCI ప్రకటించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో ఈ కొత్త రకం డిజిటల్ పేమెంట్ ని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ ప్రారంభించారు.
UPI లైట్ చిన్నమొత్తం, ఎక్కువ-ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ లావాదేవీలు చేసేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. సాధారణ యుపిఐ చెల్లింపు పద్ధతుల కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుంది. NPCI స్మార్ట్ గ్లాసెస్ UPI లైట్ ఉపయోగాన్ని ప్రదర్శించే వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో “చూడండి. మాట్లాడండి. చెల్లించండి” అనే సులభమైన ప్రక్రియ గురించి వివరించింది.
QR కోడ్ స్కాన్ చేయడం.. చెల్లింపులు పూర్తి చేయడం కోసం స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వాయిస్ కమాండ్ ఇవ్వడంతో సులభంగా లావాదేవీ పూర్తి అవుతుంది. ఇది పూర్తిగా హ్యాండ్స్-ఫ్రీ, ఈజీ ప్రాసెస్. ఫోన్ అవసరం లేదు. PIN ఎంటర్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఎక్కువగా ట్రావెలింగ్ చేసే జీవనశైలి గడిపే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ ప్రత్యేకించి వృద్ధులు, పిన్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నవారికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగంతో పాటు యుపిఐ పిన్ మార్చుకోవడానికి ఆధార్ లింక్ ఉన్న ఫేస్ ఐడి టెక్నాలజీని కూడా ఎన్‌పిసిఐ ప్రవేశపెట్టింది. దీనికోసం ఫేస్ ఆర్‌డి అప్లికేషన్ ద్వారా యుపిఐ పిన్ రీసెట్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా డెబిట్ కార్డ్ లేనివారికి ఇది ఉపయోగపడుతుంది.
అయితే ఈ టెక్నాలజీ ఇంకా అన్ని యుపిఐ యాప్స్ లో అందుబాటులో లేదు. కేవలం నావి యుపిఐ ఒక్కటే ఈ బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించింది. ఫోన్ పే, గూగుల్ పే కూడా త్వరలోనే ఈ సదుపాయాన్ని తసుకురాబోతున్నాయి.
యుపిఐ లావాదేవీలు చేయడంలో ప్రపంచంలోనే తొలిదేశమైన భారత్ ఇప్పుడు ఈ కొత్త రకం డిజిటల్ చెల్లింపు విధానాలతో మిగతా దేశాలను కూడా ప్రభావితం చేస్తోంది.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!