Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరైనా ఆభరణాలు పెట్టుకుని వెళ్తే చాలు దోపిడీకి గురైనట్టే. ఆ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి కాచి మరీ వాటిని దోచేశారు దోపిడీ దొంగలు. ఈ ఘటనతో రాజధాని వాసుల్లో భయం మొదలైంది.
దొంగలు రూటు మార్చారు. బంగారు ధర మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతుండడంతో అటు వైపు దృష్టి పెట్టారు. ఒకప్పుడు షాపులకు వెళ్లి దోపిడీలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు.. ఏకంగా రోడ్లపై వెళ్తుండగా దోపిడీలు చేస్తున్నారు. దీంతో బంగారు ఆభరణాలు పెట్టుకుని భయటకు వెళ్లాలంటే హడిలిపోతున్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం సమీపంలో దారి దోపిడీ జరిగింది. దుండగులు దారికాచి కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన శివమ్‌కుమార్ యాదవ్-రాఘవ్‌లు బంగారు ఆభరణాల బ్యాగులను తీసుకుని టూ వీలర్‌పై బయలుదేరారు.
చాందినీ చౌక్ నుంచి భైరాన్ మందిర్‌కు వెళ్తున్నారు. నగలకు షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. అందరు చూస్తుండగానే తుపాకీ గురిపెట్టి వారి వద్దనున్న నగల బ్యాగులను దోచేశారు. అయితే వారు ముఖానికి హెల్మెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
ALSO READ: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై అఘాయిత్యం
ఈ ఘటనతో షాకైన బాధితులు కాసేపటికి తేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దోపిడీ ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
దోపిడీకి గురైన వస్తువుల్లో కిలో బంగారం, 35 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మార్కెట్‌లో ఆ వస్తువుల విలువ దాదాపు కోటి పైగానే ఉండవచ్చని అంటున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
బాధితులు నగలను షాపు తీసుకెళ్తున్నట్లు వారికి ఎలా తెలిసింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. దారి దోపిడీలు ఇటీవలకాలంలో ఢిల్లీలో క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో అత్యంత భద్రత కలిగిన చాణక్యపురి ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ సుధ బంగారు గొలుసును దోపిడీ దొంగలు దోచుకుపోయారు. టూ వీలర్‌పై వచ్చిన వ్యక్తి ఎదురుగా వచ్చి ఆమె గొలుసును లాక్కొని పారిపోయిన విషయం తెల్సిందే.
ఈ దాడిలో ఎంపీ మెడకు తీవ్ర గాయాలయ్యాయి కూడా. వరుసగా దారి దోపిడీ ఘటనలు జరగడంతో బంగారు పెట్టుకుని బయటకు వెళ్లాలంటే మహిళలు హడలిపోతున్నారు. బంగారం కోసం దొంగలు తమను చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి దారి దోపిడీ ఘటనలు ఢిల్లీ పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.