భార్యా భర్తలు విడాకులు తీసుకున్నారు. భార్య కోర్టులో భరణం కోరింది. కోర్టు కూడా నెలకు 6వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. అసలే ఆ భర్త ఆవారాగాడు. ఏ పనీ చేయకుండా కాలం గడిపేవాడు. తన పొట్టపోసుకోవడమే కష్టం అనుకుంటే, కోర్టు ఇచ్చిన తీర్పు అతడికి మరింత షాకిచ్చింది. భరణం చెల్లించకుండా కాలయాపన చేస్తే జైలుకెళ్లడం ఖాయం. అందుకే అతడికి ఓ ఐడియా వచ్చింది. భరణం చెల్లించేందుకు దొంగగా మారాడు. పొరపాటున దొరికినా జైలుకే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇదే మంచి ఉపాయం అనుకున్నాడు.
భార్యకోసం..
అతడి పేరు కన్నయ్య నారాయణ బౌరాషి. ఊరు నాగ్ పూర్. మంకపూర్ ప్రాంతంలోని గణపతి నగర్ నివాసం. ఇటీవల పోలీసులు ఓ చైన్ స్నాచింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేశారు. 74 ఏళ్ల జయశ్రీ జయకుమార గడే అని వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కొని వెళ్లాడు కన్నయ్య. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా కన్నయ్యను పట్టుకున్నారు. అయితే అతడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు పోలీసులే. తాను దొంగనే కానీ మంచి దొంగను అని చెప్పాడు కన్నయ్య. తన దొంగతనానికి ఓ కారణం ఉందన్నాడు. తన భార్య కోసమే తాను దొంగతనాలు మొదలు పెట్టానన్నాడు. అసలు దీనంతటికీ కారణం కోర్టు అని మరో ట్విస్ట్ ఇచ్చాడు. కోర్టు భరణం చెల్లించాలని చెప్పిందని, కానీ తన ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోలేదని, అందుకే ఇలా దొంగగా మారి నెల నెలా మాజీ భార్యకు భరణం చెల్లిస్తున్నానని చెప్పాడు కన్నయ్య. ఆమె కోసమే తాను ప్రతి నెలా క్రమం తప్పకుండా దొంగతనాలు చేయాల్సి వస్తోందని వాపోయాడు. భరణం చెల్లించాల్సిన అవసరం లేకపోతే తాను దొంగగా మారి ఉండేవాడిని కాదంటున్నాడు కన్నయ్య.
భరణం డబ్బులు సంపాదించలేక దొంగతనాలు అలవాటు చేసుకున్న కన్నయ్య.. బంగారు గొలుసుల్ని ఓ షాపులో అమ్మేవాడు. ఆ దొంగబంగారం కొనే యజమాని కూడా ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. స్థానిక ఆభరణాల వ్యాపారి, శ్రీ సాయి జ్యువెలర్స్ యజమాని అమర్‌దీప్ కృష్ణారావు నఖతే.. బంగారం దొంగతనానికి అండగా నిలిచేవాడు. కన్నయ్య తెచ్చిన దొంగబంగారానికి వెలకట్టి తీసుకునేవాడు. దొంగబంగారం అని తెలిసి కూడా కొనుగోలు చేసినందుకు నఖతేని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగారంతోపాటు ఒక మోటర్ సైకిల్, పోన్ ని కూడా పోలీసులు కన్నయ్య నుంచి స్వాధీనం చేసుకున్నారు. సదరు మాజీ భార్య నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. భరణం చెల్లించే క్రమంలో కన్నయ్య ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా, తన దొంగతనాల గురించి చెప్పేవాడా అని ఆరా తీశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. విడిపోయిన తర్వాత కూడా భార్య సాధింపులు తప్పవా అని అంటున్నారు నెటిజన్లు. భార్యనుంచి విడాకుల తర్వాత కూడా కష్టపడుతున్న భర్తని ఇప్పుడు చూశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ దొంగతనాలకు కారణం ఆ మాజీభార్యేనని ఆమెను కూడా అరెస్ట్ చేయాలని కొంతమంది డిమాండ్ చేయడం విశేషం.