Karnataka Drugs: దేశంలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన డ్రగ్స్, క్రమంగా దక్షిణాదికి పాకుతోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి పోరాటం చేస్తోంది. తాజాగా కర్ణాటకలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఈ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం కర్ణాటక చరిత్రలో ఫస్ట్ టైమ్. మార్కెట్లో దీని విలువ రూ. 75 కోట్లు. డ్రగ్స్ గ్యాంగ్‌ని కర్ణాటక పోలీసులు ఎలా పట్టుకున్నారు? అన్నదే అసలు పాయింట్.
అసలు స్టోరీలోకి వెళ్తే
ఏడాది కిందట మంగళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా డ్రగ్స్ అమ్మే హైదర్ అలీని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో అతడు కీలక విషయాలు వెల్లడించాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వాడి నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. వీరిని విచారించి పోలీసులకు డ్రగ్స్ తీగ బయటపడింది.
దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు మహిళలు ఢిల్లీ మీదుగా బెంగుళూరుకు పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు తీసుకొచ్చినట్టు తేలింది. దీంతో రంగంలోకి దిగేశారు పోలీసులు. 31 ఏళ్ల బంబా ఘంటా, 30 ఏళ్ల అబిగైల్ అడోనిస్‌లు తరచు ఢిల్లీ నుంచి బెంగళూరుకు పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారని పసిగట్టారు. ఐదు నెలల పాటు బెంగళూరు పోలీసుల సహకారంతో వీరిపై నిఘా పెట్టారు.
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని నీలాద్రి నగరలో ఆ మహిళలను మంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాలీ బ్యాకుల్లో 37.87 కిలోల డ్రగ్స్, పాస్‌పోర్టులు, రూ.18 వేల నగదు సీజ్ చేశారు. పట్టుబడిన మహిళలు ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు తేలింది.
ALSO READ: దంపతులు ఆత్మహత్య, అసలేం జరిగింది?
ఏడాదిలో ముంబైకి 37 సార్లు, బెంగళూరుకు 22 సార్లు ట్రావెలింగ్ చేసినట్టు వివరించారు పోలీసులు. రెండేళ్లుగా వీరిద్దరు డ్రగ్స్ ముఠాలో కీలక పాత్ర పోషించినట్టు తేలింది. చివరకు నిందితులిద్దరిని మంగళూరుకు తరలించారు. పై విషయాలను మంగుళూరు పోలీసు కమిషనర్ వెల్లడించారు.
ఎలా వచ్చారంటే
బాంబా ఫాంటా 2020లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చింది. న్యూఢిల్లీలోని లక్ష్మీ విహార్‌లో ఉంటూ ఫుడ్ కార్ట్ వ్యాపారాన్ని నడుపుతోంది. అబిగైల్ జూలై 2016లో మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చింది. న్యూఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉంటూ దుస్తుల వ్యాపారంలో చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలోని ఓ ప్రయోగశాలలో ఎండీఎంఏ డ్రగ్ తయారవుతోందని పసిగట్టారు పోలీసులు. విమానంలో నిత్యం బెంగళూరుకు తరలిస్తున్నారని తెలుసుకున్నారు. రవాణా వెనుక ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌పోర్టులో కొందరు సహకారంతో మాదకద్రవ్యాల రవాణా అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
సెవెన్ సిస్టర్ సేట్స్‌లో భారీగా డ్రగ్స్ సీజ్
మాదకద్రవ్యాలుగా భావించే రూ.88 కోట్ల విలువైన మెథాంఫిటమిన్ ట్యాబ్లెట్‌ను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంఫాల్, గౌహతి జోన్లకు చెందిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. మాదకద్రవ్యాల నిరోధక దళం అధికారుల పనితీరును ఆయన ప్రశంసించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం కృషి చేస్తున్న మోదీ సర్కారు ఇలాంటి కేసుల్లో నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని ఎక్స్‌లో రాసుకొచ్చారు.