Meerpet Cooker Case: భార్యపై కోపంతో కసితీరా చంపిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పంచాయితీ పెట్టి పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్న గురుమూర్తి.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. పక్కా ప్లాన్‌తో పిల్లలను 15వ తేదీన చెల్లెలి ఇంటి వద్ద వదిలిపెట్టి.. భార్యని ఇంటికి తీసుకొచ్చాడు. 16వ తేదీన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గురుమూర్తి గొడవ పడ్డాడు. తనని పుట్టింటికి ఎందుకు పంపడం లేదని మాధవి ప్రశ్నించగా… వివాదం పెరిగి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా చేశాడు. మృతదేహం ముక్కలను నీటిలో హీటర్‌తో ఉడికించి.. ఎముకలను పొడి చేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్‌లో తీసుకెళ్లి పెద్ద చెరువులో పడేశాడు.
మరోవైపు.. తమ కుమార్తె కనిపించటం లేదంటూ 18న మాధవి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన మీర్‌పేట పోలీసులు..మాధవి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలో.. గురుమూర్తి, మాధవి కదలికలు గుర్తించారు. 15న మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.16న బకెట్‌తో ఇంటి నుంచి బయటకు వచ్చిన గురుమూర్తి విజువల్స్ చూసిన పోలీసులు.. అనుమానంతో గురుమూర్తిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. భార్యను తానే చంపానని.. 28వ తేదీన మాధవి తండ్రికి గురుమూర్తి చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. భార్య మాధవిని తానే హత్య చేశానని పోలీసులతో గురుమూర్తి చెప్పటంతో.. కేసు ఓ కొలిక్కి వచ్చింది.
ఆధారాల కోసం చెరువులో గజ ఈతగాళ్ళతో వారం పాటు మీర్‌పేట పోలీసులు వెతికించారు. చెరువులో మాంసం ముక్కలు పడేసేందుకు వాడిన బకెట్ లభ్యమైంది. ఇంటి చుట్టుపక్కల వారి సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. హత్య జరిగిన మరుసటి రోజు గురుమూర్తి ఇంటి నుంచి.. కమురు వాసన వచ్చిందని చెప్పిన ఇరుగుపొరుగువారు తెలిపారు. మాంసం ముక్కలు ఉడికిస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వాసన వచ్చిందని పోలీసులకు చెప్పారు.
తనకు కూడా ఏదో కాలిన వాసన వస్తోందని పెంట్‌హౌస్‌లో ఉంటున్న రత్లావత్ పుష్ప చెప్పగా.. నాన్ వెజ్ కూర వండుతున్నానని గురుమూర్తి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. భార్య మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో ముక్కలు చేసిన గురుమూర్తి.. ఉడికించిన వ్యర్థాలను కమోడ్‌లో వేసి ఫ్లష్ చేశాడు. ఇంట్లో వాసన రాకుండా ఉండేందుకు.. ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు. నిందితుని ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, నాయిల్ సీసాలు, ఖాళీ పెయింట్ బకెట్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read: శవాన్ని దొంగలించిన హోటల్ వ్యాపారి.. దోపిడీకి పెద్ద స్కెచ్
కాగా సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు అతడిని కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతించడంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో గురుమూర్తికి సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో కుటుంబసభ్యులను విచారించారు.
అయితే అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురుమూర్తికి.. అతని చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, తమ్ముడు కిరణ్ సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాలు మాయం చేసేందుకు వారు ప్రయత్నించారని ముగ్గురిపై అభియోగం నమోదైంది. సూక్ష్మదర్శిని సినిమాను తలపించేలా సీన్లు ఉండటంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.