Money Laundering : అంతర్జాతీయ మనీలాండరింగ్ ఆపరేషన్‌లో ఓ పెద్ద అవినీతిని అమెరికా అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ నేరంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఎరెస్ట్ చేయడమే కాకుండా.. అక్కడి కోర్టు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హవాలా మార్గాల్లో నిధుల్ని అక్రమంగా విదేశాలకు తరలించడం, మాదక ద్రవ్యాలు సహా ఇతర నేర సామ్రాజ్యాలకు డబ్బు సాయం చేశాడనే కారణంగా ఓ భారతీయుడిని అమెరికన్ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ క్రిప్టో కరెన్సీ లాండరింగ్ ను సమర్థవంతంగా అడ్డుకున్నారు.
భారత జాతీయుడు అనురాగ్ ప్రమోద్ మురార్కా.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం, వాటిని ఇతరులకు విక్రయించడం చేస్తుంటాడు.
క్రిప్టో, హవాలా వ్యవస్థతో కూడిన అధునాతన ఆపరేషన్ ద్వారా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జిస్తుంటాడు. దాంతో పాటే.. వచ్చిన ఆదాయాన్ని మాదక ద్రవ్యాల ముఠాలు, ఇతర ప్రమాదకర ముఠాలు వినియోగిస్తున్నాయని గుర్తించిన అమెరికన్ అధికారులు.. అనురాగ్ ప్రమోద్ ను అరెస్ట్ చేశారు. ఈ నెట్ వర్క్ తో మొత్తంగా.. 20 మిలియన్ డాలర్ల నేరపూరిత పనులు జరిగినట్లుగా గుర్తించారు. కోర్టులో అతని నేరాన్ని పక్కాగా నిరూపించడంతో.. మురార్కా ని దోషిగా తేల్చిన అమెరికాలోని డిస్ట్రిక్ జడ్జ్ గ్రెగొరీ వాన్ టాటెన్‌హోవ్.. 121 నెలల శిక్షను ఖరారా చేశారు.
క్రిప్టో కరెన్సీని అక్రమ మార్గాల్లో సంపాదించడం, ప్రభుత్వాలు తెలియకుండా ప్రమాదకర గ్రూపు లతో సంబంధాలకు వియోగించడంతో మురార్కా సిద్ధహస్తుడు అంటున్నారు పోలీసులు. ఇతను.. “elonmuskwhm”, “la2nyc” అనే మారుపేర్లతో ఏప్రిల్ 2021 నుంచి సెప్టెంబరు 2023 వరకు డార్క్‌నెట్ మార్కెట్ ప్లేస్‌లలో మనీ లాండరింగ్ సేవలను ప్రచారం చేశారు.
ఇందుకోసం నిందితుడు ఎవరికి సాక్ష్యాధారాలు దొరకకుండా ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను ఉపయోగించే వాడు. విదేశాల్లోని క్లయింట్‌లతో మాట్లాడి.. వాళ్లను పెట్టుబడులకు ఒప్పించే ప్రమోద్.. వారి నుంచి తనకు చెందిన వాలెట్‌లకు క్రిప్టోను పంపేలా చేసేవాడు. ఆ డబ్బుల్ని భారత్ లోని హవాలా నెట్‌వర్క్ కు చేరవేసి.. క్రిప్టో నిధుల్ని నగదుగా మార్చుతున్నాడు.
ప్రభుత్వ విచారణ సంస్థలకు అనుమానం రాకుండా.. అతని దగ్గర పని చేసే ఉద్యోగులు నగదును ప్యాకేజీలుగా చేసి.. పుస్తకాలు, ఎన్వలప్‌లలో దాచడం సహా సంప్రదాయేతర పద్ధతుల ద్వారా క్రిప్టో ఖాతాదారులకు పంపిణీ చేసినట్లు గుర్తించారు. అయితే.. ఇందులో.. ప్రమాదకర శక్తులకు ప్రయోజం కలుగుతున్నట్లు అమెరికా విచారణ సంస్థల అధికారులు గుర్తించారు. ఎఫ్‌బిఐ, యుఎస్ పోస్టల్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ (యుఎస్‌పిఐఎస్) నేతృత్వంలోని దర్యాప్తులో మురార్కా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కంప్యూటర్ హ్యాకింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో ఇతని సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో గుర్తించారు.
అనురాగ్ ప్రమోద్ మురార్కాను అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు లక్షలాది అక్రమ నిధులను స్వాధీనం చేసుకున్నారు. అతని ఆన్‌లైన్ ఖాతాలను స్వాధీనం చేసుకుని.. నకిలీ మందులు, పరికరాలను కొనుగోలు పేరుతో ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు సిద్ధంగా ఉంచిన $1.4 మిలియన్ల ఆర్థిక మోసాన్ని నిరోధించించారు.
ఈ కేసు సైబర్ క్రైమ్ లో సరికొత్త విషయాన్ని పరిచయం చేస్తోందని, అక్రమ మనీ లాండరింగ్ పోరాటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలుపుతోందని అమెరికాలోని కెంటుకీ స్టేట్, ఈస్ట్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్ల్టన్ S. షియర్ అన్నారు. ప్రస్తుతానికి.. మురార్కా కు 121 నెలల శిక్ష విధించగా.. అమెరికన్ ఫెడరల్ లా ప్రకారం, తన శిక్షలో కనీసం 85% శిక్షను కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఆపై విడుదలైనా.. మూడేళ్ల పాటు అక్కడ అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని అమెరికా అధికారులు తెలుపుతున్నారు.