AP Crime News: కర్నూలు జిల్లాలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గార్గేయపురం చెరువు సాక్షిగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా మారారు. కన్నబిడ్డలను ప్రాణంగా చూసుకోవాల్సిన తల్లి, వారితో సహా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో గార్గేయపురం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతులను రాజేశ్వరి (35)తో పాటు ఆమె ఇద్దరు కుమారులు అబ్రహం (3), సుకుమార్ (6)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం మేరకు, గత కొంతకాలంగా రాజేశ్వరి దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మనస్పర్థలు ముదిరి, జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అభం శుభం తెలియని పసికందులను కూడా తనతో పాటు అనంతలోకాలకు తీసుకువెళ్లడం అందరినీ కలిచివేస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని విచారించడం ద్వారా ఈ విషాదం వెనుక ఉన్న ఇతర కోణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో దారుణం.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పచ్చని సంసారాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. సమస్యలు ఏవైనా సరే, ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, కౌన్సెలింగ్ లేదా పెద్దల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. అంతులేని ఆవేదనతో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును చిదిమేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.